తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎప్పుడూ కొత్త టాలెంట్ గురించి ఆరా తీస్తుంటుంది, ముఖ్యంగా నిర్మాతలు మరియు హీరోలు అప్ కమింగ్ లేదా యంగ్ డైరెక్టర్లను గమనించడానికి ఆసక్తి చూపుతారు. తన మొదటి సినిమా విడుదలకు ముందే ఇప్పుడు అలా పరిశ్రమలో లైమ్ లైట్ లో ఉన్నారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.
నేచురల్ స్టార్ నాని తన తదుపరి చిత్రం దసరాతో శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా విడుదలకు ముందే శ్రీకాంత్ ఓదెల చాలా సామర్థ్యం గల వాడని.. అంతే కాకుండా ఆయన వద్ద అద్భుతమైన కథలు కూడా ఉన్నాయని నిర్మాతలు నేరుగా ఇతర హీరోలకు తెలియజేస్తున్నారని సమాచారం.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజతో పాటు ఇతర హీరోలు శ్రీకాంత్ సంప్రదించినట్లు కూడా తెలుస్తోంది. అందరూ ఊహించినట్టుగా దసరా ఘనవిజయం సాధిస్తే తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లకు చాలా కొరత ఉంది కాబట్టి ఈ దర్శకుడు ఖచ్చితంగా స్టార్ డైరెక్టర్స్ లీగ్ లో చేరిపోతారు అని అంటున్నారు.
ఇక దసరా టీజర్ విడుదల సందర్భంగా నాని కూడా దర్శకుడిని ఆకాశానికి ఎత్తేశారు. అయితే శ్రీకాంత్ ఓదెల మీద ఉన్న హైప్ అంతా నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
హీరో నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ప్రాజెక్ట్ గా దసరా సినిమా తెరకెక్కింది. సినిమాకి 65 కోట్లకు పైగా ఖర్చు అవగా, నిర్మాత థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా మొత్తం మొత్తాన్ని రికవరీ చేసి దాదాపు 10 కోట్ల లాభాలు ఆర్జించారని అంటున్నారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్, సాయి కుమార్, షిన్ టామ్ చాకో, రాజశేఖర్ అనింగి తదితరులు నటించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ , మలయాళ భాష ల్లో మార్చి 30న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణలోని రామగుండం గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది