గత ఏడాది అఖండ చిత్రం ఘన విజయం సాధించి నందమూరి బాలకృష్ణకు కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ సినిమా ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో బాలకృష్ణ వరుస సినిమాలను ఒప్పుకుంటున్నారు. అంతే కాకుండా తన అభిమానులకు, ప్రేక్షకులకు తన మాస్ తడాఖాని మరింత స్థాయిలో ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం, బాలయ్య దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి NBK107 కోసం పని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇక దర్శకుడు గోపీచంద్ మలినేని తాజాగా అందించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలైన క్రాక్ బలుపు వంటి చిత్రాలలో నటించిన శృతి హాసన్ NBK107లో బాలకృష్ణ సరసన నటించనున్నారు. ఈ సినిమాతో పాటు యువ దర్శకుడు, వరుస విజయాలతో సక్సెస్ ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా బాలకృష్ణ ఓ సినిమాలో నటించనున్నారు.
కాగా ఈ సినిమా తన గత సినిమాలన్నింటికీ చాలా భిన్నంగా ఉంటుందని, బాలయ్య పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపిస్తారని దర్శకుడు అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. బాలకృష్ణ స్టైల్‌కు తగ్గట్టుగా ఉంటూనే కాస్త కొత్త నేపథ్యంలో సినిమా ఉంటుందని, అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయని సమాచారం.
అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి అనిల్ రావిపూడి చాలా జాగర్తగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పనులు చూసుకుంటున్నారు. అంతే కాక కమర్షియల్ ఎలిమెంట్స్‌ని హైలైట్ చేయడంలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వడం లేదు. ఇక ఈ చిత్రంలో తన మార్కు కామెడీ కూడా సమపాళ్లలో ఉండేలా అనిల్ రావిపూడి శ్రద్ధ వహిస్తున్నారు.
ఈ చిత్రం తర్వాత, బాలకృష్ణ దర్శకుడు బాబీతో ఒక సినిమా చేయనున్నారని తెలుస్తోంది. బాబీ ప్రస్తుతం చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా బిజీగా ఉన్నారు. ఆ చిత్రం పూర్తయిన తర్వాత బాలకృష్ణ కాంబినేషన్లో ఔట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ కోసం పని చేయనున్నారు. కాగా ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగ వంశీ నిర్మించబోతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.
మొత్తానికి వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో.. కమర్షియల్ దర్శకుల చక్కని లైనప్ తో బాలయ్య దూసుకుపోతున్నారు. ఇక ఈ జోరు ఇప్పట్లో ఆగేలా లేదు.