నందమూరి బాలకృష్ణ ఓ కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు ఆ సామాజికవర్గం వారు ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే ఆయన తన వ్యాఖ్యలకు గల కారణాన్ని వివరిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది.
నందమూరి బాలకృష్ణకు మన ఇతిహాసాలు, రామాయణ, మహాభారతాల మీద ఎంతగా పట్టు ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే అలాంటి బాలయ్య ఓ చిన్న తప్పు చేశారు. వీర సింహా రెడ్డి సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ.. దేవ బ్రాహ్మణుల గురువు దేవళ మహర్షి అని, వారి నాయకుడు రావణ బ్రహ్మ అని అన్నారు. దీంతో ఆ వర్గానికి చెందిన వారు ఆయన వ్యాఖ్యల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్ర తెలియకుండా మాట్లాడొద్దని, బాలకృష్ణ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
దేవబ్రాహ్మణ సంఘం నాయకులు కుల చరిత్ర గురించి తనను సరిదిద్దినందుకు వారిని బాలకృష్ణ ప్రశంసించారు. తాను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అనుకోలేదని, తన వ్యాఖ్యలకు ఎవరైనా నొచ్చుకుని ఉంటే అందుకు క్షమాపణలు చెబుతున్నానని ఆయన అన్నారు. అంతే కాక, దేవబ్రాహ్మణ సభ్యులు తన క్షమాపణను స్వీకరించాలని ఆయన ఆకాంక్షించారు.
మరో వైపు బాలయ్య వీరసింహారెడ్డి గత గురువారం విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు.
బాలకృష్ణ 107వ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎప్పుడైతే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారో అప్పటినుంచే నందమూరి ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. విడుదల తర్వాత నందమూరి ఫ్యాన్స్ కోరుకున్న అన్ని అంశాలూ సినిమాలో ఉండటంతో ఆనందించారు.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా.. హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ స్టార్ దునియా విజయ్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.