2022లో విడుదలై విజయం సాధించిన సినిమాల్లో ‘డీజే టిల్లు’ సినిమా ఒకటి. చిన్న సినిమాగా వచ్చి సూపర్ ఎంటర్టైనర్ గా నిలిచింది. టైటిల్ రోల్ లో సిద్ధు జొన్నలగడ్డ అద్భుతంగా నటించి తనదైన ఎనర్జీతో ఆకట్టుకున్నారు. డీజే టిల్లు చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అంతే కాకుండా నిర్మాతలకు రెండింతల లాభాలు తీసుకొచ్చింది. ఈ సినిమాతో యువ హీరో సిద్ధూ జొన్నలగడ్డకి మంచి బ్రేక్ వచ్చింది. తెరపై సిద్ధూ తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటే ఆ పనితనాన్ని రాబట్టుకుని తన దర్శకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నారు విమల్ కృష్ణ.
‘డీజే టిల్లు’ సినిమాకు దర్శకత్వ బాధ్యతతో పాటు రచయితగా కూడా పని చేశారు విమల్ కృష్ణ. ఈ సినిమాతో తన ప్రతిభను నిరూపించుకున్న విమల్ కృష్ణకి డీజే టిల్లు విజయం తరువాత హీరోలు, నిర్మాతల నుంచి పిలుపు వచ్చిందని తెలుస్తోంది. ఈ యువ దర్శకుడిని పిలిపించుకొని మరీ కథను వింటున్నారట హీరోలు, నిర్మాతలు.
ఇటీవల విమల్ కృష్ణ నాగచైతన్యను కలిసి కథ వినిపించారని తెలిసింది. విమల్ చెప్పిన కథ చైతన్యకి బాగా నచ్చిందట.ప్రస్తుతం చైతన్య – విమల్ కృష్ణల మధ్య కథా చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ఒక్కసారి కథ ఓకే అయిపోతే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాలని చూస్తున్నారట. కానీ ప్రస్తుతం నాగ చైతన్య షెడ్యూల్ చాలా బిజీగా ఉంది.
‘థాంక్యూ’ సినిమా విడుదలైన తరువాత పరశురామ్ పెట్లతో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అలానే బొమ్మరిల్లు భాస్కర్ తో కూడా ఒక సినిమా ఉంటుందని సమాచారం. వీటితో పాటు మరో రెండు, మూడు కథలను కూడా చైతన్య ఎంపిక చేశారట. వీటన్నింటి మధ్య విమల్ కృష్ణతో సినిమా ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి.
థాంక్యూ లాంటి డిజాస్టర్ తరువాత మళ్ళీ గట్టి హిట్ కొట్టాలని నాగ చైతన్య బలమైన సంకల్పంతో ఉన్నారు. వరుస విజయాలతో ఉన్న సమయంలో థాంక్యూ చిత్రం నాగ చైతన్యను తీవ్రంగా నిరాశ పరిచింది. మరి చక్కని కథలతో మరియు పాత్రలతో తిరిగి ప్రేక్షకులని ఆకట్టుకుని నాగ చైతన్య తిరిగి విజయాలు సాధిస్తారని ఆశిద్దాం.