అక్కినేని నాగ చైతన్య – దర్శకుడు పరశురాం కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో రావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో ఈ సినిమాను లాంచ్ చేశారు. అయితే పరశురామ్ కి మహేష్ బాబు తో సినిమా చేసే అవకాశం రావడంతో ఆ సినిమా వెనక్కి వెళ్ళింది. ‘సర్కారు వారి పాట’ సినిమా తర్వాత నాగచైతన్య తో సినిమా చేయబోతున్నట్లు దర్శకుడు పరశురామ్ ఇది వరకే చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు.
‘థాంక్యు’ సినిమా ప్రచార కార్యక్రమాలలో లో నాగ చైతన్య కూడా ఈ సినిమా ఉంటుందని చెప్పారు. ఈ మధ్యే పరశురాంతో కలిసి స్క్రిప్ట్ గురించి చర్చలు జరిపామని తెలిపారు. కాకపోతే ఇంకా పూర్తి స్థాయి స్క్రిప్ట్ వినిపించలేదని.. ఒకసారి కథ అంతా సిద్ధమయ్యాక ఆ సినిమా ఎప్పుడో తెలియ జేస్తామని నాగ చైతన్య అన్నారు.
అయితే తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం దర్శకుడు పరశురాం ఇటీవలే చైతన్య కు స్క్రిప్ట్ వినిపించారట. అందుకు చైతన్య కూడా ఓకే అన్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రధానంగా ఒక ప్రేమకథగా తెరకెక్కబోతుంది. అయితే అందులో యాక్షన్ సన్నివేశాలకు కూడా తగిన ప్రాధాన్యత ఉంటుందని వినిపిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
‘శ్రీరస్తూ శుభమస్తు’ ‘గీత గోవిందం’ తర్వాత గీతా ఆర్ట్స్ సంస్థలోనే పరశురాం మరో సినిమా చేయాల్సి ఉండింది. అలానే ‘100% లవ్’ తర్వాత నగా చైతన్య కూడా ఆ బ్యానర్ లో సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు. ఇప్పుడు దర్శక హీరోలిద్దరూ కలిసి అల్లు అరవింద్ నిర్మాణంలో తమ హ్యాట్రిక్ సినిమాను కలిసి చేస్తారు అన్నమాట.
ఇక ఈ సినిమాలో నాగచైతన్య సరసన హీరోయిన్ గా రష్మిక మందన్నా నటించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా రాజ్యం ఏలుతున్న రష్మిక.. ఇంతకుముందు పరశురాం దర్శకత్వంలో చేసిన ‘గీత గోవిందం’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగ చైతన్య కోసం లక్కీ బ్యూటీ అయిన నేషనల్ క్రష్ ను నటింపజేసే ఆలోచనలో పరశురామ్ ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.