అక్కినేని నాగచైతన్య – సమంతల జంట వారి కుటుంబాలు. మరియు అభిమానులు ఎంతో ఆనందించేలా వైభవంగా వివాహం చేసుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా వారు విడాకులు తీసుకున్నారు. వారిరివురూ విడిపోయి దాదాపు పది నెలలు కావొస్తున్నా ఇప్పటికీ వీరి విడాకులకు సంబంధించిన వార్తలు ఏదో రకంగా మీడియాలో చర్చకు వస్తూనే ఉన్నాయి. ప్రేమించి పెళ్ళి చేసుకున్న చైతన్య-సమంత.. పెళ్లయి నాలుగు ఏళ్ళు కూడా పూర్తి కాక ముందే విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించి అందరికీ విస్మయం కలిగించారు.
అప్పటి నుంచి సమంత – చైతన్య ఇద్దరూ వారి వ్యక్తిగత కెరీర్ పై దృష్టి సారించి ఎవరి పనుల్లో వారు ఉన్నారు. విడాకుల విషయం వారి పై ప్రభావం చూపించకుండా.. వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.
అయితే విడాకుల ప్రకటన తర్వాత వీరిద్దరూ మళ్లీ పబ్లిక్ లో ఎక్కడా కలవలేదు. ఒకవేళ కలిస్తే ఏం చేస్తారు అనే ప్రశ్నకు చైతన్య చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్య పరిచింది.
నాగచైతన్య ప్రస్తుతం అమీర్ ఖాన్ తో కలిసి చేసిన ‘లాల్ సింగ్ చద్దా’ ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఇందులో బోడి బాలరాజు అనే పాత్రలో చైతన్య కనిపించనున్నారు. ఇది తనకు హిందీలో తొలి సినిమా కావడంతో ఈ సినిమాని చైతన్య భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో చైతన్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. ఒకవేళ మీ మాజీ భార్య సమంత కనిపిస్తే ఏం చేస్తారనే ప్రశ్నను ఎదుర్కొన్నారు. దీనికి చైతన్య సమంతకు హాయ్ చెప్పి హగ్ చేసుకుంటానని సమాధానమిచ్చారు. అలాగే తన చేతిపై ఉన్న పచ్చబొట్టు గురించి చెప్తూ.. ఆ పచ్చబొట్టు సమంత గుర్తుగా ఉన్న మార్స్ కోడ్ అని..అయితే విడాకుల తరువాత కూడా ఆ పచ్చబొట్టును తీసేసే ఉద్దేశ్యం తనకు లేదని అన్నారు.
అయితే ఇటీవలే సమంతా ‘కాఫీ విత్ కరణ్’ షోలో దీనికి పూర్తిగా భిన్నంగా మాట్లాడిన విషయం తెలిసిందే.ఆ షోలో ఒక ప్రశ్న అడిగే సందర్భంలో నాగ చైతన్యను కరణ్ భర్త అని సంభోదించడానికి కూడా ఇష్టపడలేదు సమంత.. తమ మధ్య సరైన సంబంధాలు లేవనే విషయం చెప్పారు. అలాగే మరో ప్రశ్నకు సమాధానంగా.. మా ఇద్దరినీ ఒక గదిలో ఉంచినట్లయితే.. ఆ గదిలో ఉన్న పదునైన వస్తువులను దాచాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అలానే ఉంది. కానీ ఆ భావన భవిష్యత్తులో మారొచ్చని అని సమంత చెప్పుకొచ్చారు.
‘ఏమాయ చేసావే’ సినిమాలో కలిసి నటించిన నాగచైతన్య – సమంత.. ‘ఆటోనగర్ సూర్య’ ‘మనం’ వంటి చిత్రాల్లో నటించి.. విజయ వంతమైన జోడీగా ప్రేక్షకుల మన్నన పొంది అదే క్రమంలో ప్రేమలో పడి కొన్నాళ్లు డేటింగ్ చేసిన తరువాత పెద్దలను ఒప్పించి 2017 లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి ‘మజిలీ’ సినిమాలో నటించి మంచి హిట్ సినిమాని తమ ఖాతాలో జమ చేసుకున్నారు. అలాగే సమంత నటించిన ‘ఓ బేబీ’ చిత్రంలో చైతన్య గెస్ట్ రోల్ కూడా చేశారు.
అయితే అనూహ్యంగా వారు తమ దాంపత్య జీవితాన్ని సాఫీగా కొనసాగించలేక విడిపోతున్నారనే పుకార్లు మొదలయ్యాయి. మొదట్లో ఆ వార్తలను ప్రేక్షకులు నమ్మలేదు. కానీ ఆ వార్తలను నిజం చేస్తూ 2021 అక్టోబర్ లో చైతన్య – సమంత విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఎవరి దారిలో వారు ముందుకు వెళుతున్నారు.