అక్కినేని నాగ చైతన్య నటించిన థాంక్యూ సినిమా ఇటీవల విడుదలై ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. మొదటి రోజు కూడా ఈ సినిమా కనీస సాధారణ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడంలో విఫలమయింది.
వరుసగా విభిన్నమైన సినిమాలతో దర్శకుడు విక్రమ్ కె కుమార్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చారు. దర్శకుడిగా ఆయన అభిరుచి గల వాడు అని.. సాంకేతికంగా ఆయనకు ఎంతో పరిజ్ఞానం ఉందని ప్రేక్షకులు ఆయనను ఎపుడూ గౌరవిస్తూ ఉంటారు. 13బి, మనం, 24 లాంటి సినిమాలను ఆయన ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. విభిన్నమైన కథాంశంతో పాటు సినిమాను సాంకేతికంగా కూడా అత్యున్నత స్థాయిలో మలచడంలో ఆయనకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది.
అలాంటి విక్రమ్ కుమార్ నుంచి థాంక్యూ లాంటి ఏమాత్రం ప్రభావం చూపించని సినిమా వస్తుందని ప్రేక్షకులే కాదు ఇతర పరిశ్రమ వర్గాలు కూడా అనుకోలేదు.
ఇక నిర్మాత దిల్ రాజుకు కథల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తారని, సినిమా చిత్రీకరణ దశలోనే ఏమైనా పొరపాట్లు ఉంటే సరి చేసుకుని అన్నీ దగ్గరుండి చూసుకుంటారు అని పేరుంది. అలాంటి దిల్ రాజు నిర్మాణంలో ఇంత దారుణమైన ఫలితం ఇచ్చే సినిమా వస్తుందని కూడా ఎవరూ ఊహించి ఉండరు.
ఇక ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా దానికి దిల్ రాజు కేంద్ర బిందువుగా మారుతున్నారు. నైజాం ఏరియాలో థియేటర్ల టికెట్ రేట్లు పెంచిన విషయం కావచ్చు.. ఓటిటి రిలీజ్ కు గడువు పెంచిన విషయం కావచ్చు. ఇక తాజాగా రగులుతున్న షూటింగ్ ల బంద్ వివాదం కావచ్చు అన్నిటిలోనూ ఆయనే ప్రధాన కర్తగా కనిపిస్తున్నారు. దీంతో సహజంగానే ఆయనను అటు ప్రేక్షకులతో పాటు ఇటు ఇతర నిర్మాతలు కూడా నిందించడం మొదలు పెట్టారు.
ఇక ఈ క్రమంలోనే నిర్మాతల గిల్డ్ తాజా సూచనల మేరకు చిన్న సినిమాలు అయితే ధియేటర్ లో విడుదలైన ఆరు వారాల తరువాత, అదే పెద్ద సినిమాలు అయితే ఎనిమిది వారాల తరువాతే ఓటిటిలో విడుదల చేస్తామని తెలిపారు. అయితే ఈ నియమాన్ని జూలై నుంచి విడుదలైన సినిమాలు ఈ నిభందనలు పాటిస్తాయని అందరూ అనుకున్నారు. కానీ పక్కా కమర్షియల్, ది వారియర్ సినిమాకి ఏవీ ఆ గ్యాప్ పాటించకుండా ఐదు వారాలు, నాలుగు వారాలకు ఓటిటిలో విడుదల అవుతున్నాయి.
తాజాగా ఆ కోవలోనే దిల్ రాజు నిర్మించిన చిత్రం కూడా ఉండటం గమనార్హం. థాంక్యూ సినిమా ఆగస్ట్ 12 నుండీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. అంటే థియేటర్ లో విడుదలైన మూడు వారాలకే ఓటిటిలో విడుదల అవబోతుందు అన్నమాట. మరి దిల్ రాజు ఈ విషయంలో ఏం లాజిక్ చెప్తారు అనేది చూడాలి.