ప్రస్తుతం అటు ఇండస్ట్రీ వర్గాల్లో.. ఇటు ప్రేక్షకుల చర్చల్లో ఓకే పేరు ఉంది. ఆ పేరే మృణాల్ ఠాకూర్. ఈ.శుక్రవారం విడుదలై ఘన విజయం సాధించిన “సీతారామం” సినిమాలో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు మృణాల్.
మహారాష్ట్రలో జన్మించిన మృణాల్ 2014 లోనే ఒక మరాఠీ చిత్రంతో కెరీర్ ను ప్రారంభించించారు. ఇక 2018 లో ‘లవ్ సోనియా’తో బాలీవుడ్ లోకి అడుగు పెట్టి.. తనదైన టాలెంట్ తో అక్కడ వరుస అవకాశాలను దక్కించుకోవడం మొదలెట్టారు. ఈ మధ్యే ‘జెర్సీ’ సినిమాతో నార్త్ ప్రేక్షకులను పలకరించారు. ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేక పోయినా, మృణాల్ నటనకు చక్కని మార్కులు పడ్డాయి. ఈ చిత్రం నాని నటించిన ‘జెర్సీ’ సినిమాకు రీమేక్ అన్న విషయం తెలిసిందే.
ఇక మృణాల్ ఠాకూర్ తాజాగా ‘సీతారామం’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, మృణాల్ జంటగా నటించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్, భూమిక చావ్లా, గౌతం వాసుదేవ్ మీనన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ‘మహానటి’ తర్వాత దుల్కర్ నేరుగా తెలుగులో చేసిన సినిమా ఇదే కావడం విశేషం.
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై హై బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం ఆగస్టు 5న తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదలై.. తొలి ఆట నుండే చక్కని రివ్యూలను, ప్రశంసలను సొంతం చేసుకుంది.
యుద్దంతో ముడిపడి ఉన్న ఓ అందమైన ప్రేమకథ అయిన ఈ సినిమా 1965 – 1985 అనే రెండు కాలమానాల నేపథ్యంలో సాగుతుంది. చక్కని అభిరుచి గల దర్శకుడు అయిన హను రాఘవపూడి ‘సీతారామం’లో కూడా తమ మ్యాజిక్ ను చూపించారు. ఇండియన్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఒదిగిపోయారు. ఇక సీత పాత్రకు మృణాల్ పూర్తి న్యాయం చేయడమే కాకుండా హీరో దుల్కర్ తో పాటు సినిమాలో అందరినీ డామినేట్ చేయడం ఎవరూ ఊహించని విషయం.
తెరపై ఎంతో అందంగా కనిపించడమే కాదు.. భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఏమాత్రం బెదరకుండా ఆమె నటించిన తీరు ప్రశంసనీయం. ముఖ్యంగా క్లైమాక్స్ లో అయితే మరింత అద్భుతంగా నటించి ప్రేక్షకులను కట్టిపడేసారు మృణాల్. ‘సీతా రామం’ సినిమాతో మృణాల్ కు తెలుగు సినిమా పరిశ్రమలో ఘనమైన ప్రవేశం లభించిందని, అంతే కాకుండా ఇక పై టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఆమె మారిపోవడం ఖాయమను సినీ ప్రియులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మృణాల్ హవా నడుస్తున్న మాట నిజమే. త్వరలోనే ఆమెకు స్టార్ హీరోల పక్కన అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఏ మేరకు సీతారామం సినిమాతో వచ్చిన క్రేజ్ ను మృణాల్ సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.