ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి వరుసగా అవార్డులు, ప్రశంసలతో తన కెరీర్ లో సువర్ణాధ్యాయాన్ని గడుపుతున్నారు. 2022 లో విడుదలైన బ్లాక్బస్టర్ ఆర్ఆర్ఆర్ నుండి చార్ట్ బస్టర్ ‘నాటు నాటు’ పాటకి గానూ బెస్ట్ సాంగ్ – మోషన్ పిక్చర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డును ఈ ప్రఖ్యాత స్వరకర్త గెలుచుకున్నారు.
తాజాగా ఎంఎం కీరవాణిని భారత నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించారు. కీరవాణికి పద్మశ్రీ అవార్డు రావడం ఆయన అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులను కూడా అత్యంత ఉత్సాహానికి గురిచేసింది.
దేశంలో నాలుగో అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న తర్వాత ఉప్పొంగిపోయిన ఆర్ఆర్ఆర్ కంపోజర్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసి ఈ గొప్ప గౌరవం పై స్పందించారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులకు, కవితాపు సీతన్న గారి నుంచి కుప్పాల బుల్లిస్వామి నాయుడు గారి వరకు ఆయన గురువులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
కాగా భారత ప్రభుత్వం నుంచి నాలుగో అత్యున్నత పౌర పురస్కారం రావడం చాలా గౌరవంగా భావిస్తున్నానని ఎంఎం కీరవాణి తన పోస్ట్ లో పేర్కొన్నారు. తెలుగు సినీ ప్రేక్షకులు, సినీ పరిశ్రమ సభ్యులు ఇప్పుడు ఆయన సోషల్ మీడియా పోస్ట్ పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు.
ఎంఎం కీరవాణితో పాటు బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కూడా పద్మశ్రీ అందుకున్నారు. ఇక ప్రముఖ తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్, లెజెండరీ సింగర్ వాణీ జయరామ్, సింగర్ సుమన్ కళ్యాణ్పూర్ తదితరులు ఈ ఏడాది ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు.