మెగాస్టార్ చిరంజీవి అనే పేరుకి ఆ మహా మనిషికి ఎలాంటి ఇమేజ్ ఉందో.. అభిమానులలో ఆయనని ఎలా దేవుడిలా కొలుస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయన అంతలా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు, ఆ అభిమానులు ఆయనని ఎన్నో సంవత్సరాలుగా ఆరాధిస్తూ వచ్చారు.
అంతే కాకుండా వారి జీవితంలో కనీసం ఒక్కసారైనా తమ అభిమాన హీరోని కలవాలని ఆసక్తిగా ఎదురుచూస్తు ఉంటారు. ఏ అభిమానికైనా ఇది సర్వ సాధారణంగా ఉండే కోరిక. ఇదిలా ఉండగా చిరంజీవి గారి స్వస్థలమైన మొగల్తూరు నుండి వచ్చిన నాగరాజు.. మెగాస్టార్ ను అభిమానించే కోట్ల సంఖ్యలో ఉన్న అభిమానుల్లో ఒకరు.
అలాంటి నాగరాజును అదృష్టం వరించింది.
ఎట్టకేలకు మెగాస్టార్‌ని కలిసే అవకాశం నాగరాజుకు దక్కడంతో ఆయన ఆనందానికి అవధులు అనేవి లేకుండా పోయాయి. అయితే తన ఆరాధ్య దైవాన్ని కలిసే సమయంలో నాగరాజు పరిస్థితి ఏమీ బాగోలేదు. తన రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, గత కొంత కాలంగా ఇదే పరిస్థితితో పోరాడుతున్నానే విషయాన్ని నాగరాజు చిరంజీవికి చెప్పుకుని బాధ పడ్డారు. నిజానికి ఆయన తన చివరి కోరికగా చిరంజీవిని కలవాలనుకున్నారట. తన అభిమాని ఎదురుకుంటున్న కష్టాలను చూసి చిరంజీవి చలించిపోయారు. అంతే కాదు తనకు అన్ని విధాలా ఆర్థిక సాయం చేస్తానని హామీ కూడా ఇచ్చారు.
హైదరాబాద్ లోని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఆ సమయంలో నాగరాజుతో చిరంజీవి గంటకు పైగా మాట్లాడారట. మెగాస్టార్ నాగరాజుకు అవసరమైన నైతిక మద్దతును ఇస్తూ.. దాంతో పాటు అత్యవసరమైన అన్ని రకాల వైద్య, ఆర్థిక సహాయాన్ని అందించారు.
వెండి తెర పై హీరోయిజం ను ప్రదర్శించే హీరోగానే కాకుండా.. తెర బయట చేసే సమాజసేవతో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ తన సేవా గుణాన్ని చాటుకున్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పెట్టి వాటి దానాల ద్వారా ఎంతో మంది అభిమానులను సమాజ సేవ వైపు ప్రేరేపించారు. అలాగే ఇండస్ట్రీలో సీనియర్ నటులు లేదా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న ఆర్టిస్టులను ఆదుకోవడంలో కూడా ఎన్నో సార్లు ముందుండి శభాష్ అనిపించుకున్నారు.