మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత సంక్రాంతి ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య సినిమాలని విడుదల చేయగా, ఈ రెండు సినిమాలు చిరంజీవికి అదిరిపోయే కలెక్షన్లు తెచ్చిపెట్టాయి. అందుకే మళ్ళీ 2024 సంక్రాంతికి ఒక సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
మొదట వచ్చే సంక్రాంతి సీజన్ కు రామ్ చరణ్ ఆర్ సి 15, అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలు వస్తాయని వార్తలు వచ్చాయి కానీ తాజా సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాలు 2024 సంక్రాంతికి విడుదల కావడం లేదని, కేవలం పవన్ కళ్యాణ్ కు మాత్రమే హరీష్ శంకర్ సినిమాని విడుదల చేసే అవకాశం ఉందని, కానీ ఆ సినిమా విడుదల కూడా ఖచ్చితంగా ఖాయమేమీ కాదని అంటున్నారు.
కాబట్టి అన్ని పరిస్థితులు చూస్తుంటే వచ్చే సంక్రాంతికి చిరంజీవి ఓ సినిమాను సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమా పండుగకు రాకపోతే హాలిడే అడ్వాంటేజ్ క్యాష్ చేసుకునేందుకు చిరంజీవి తన సినిమాను విడుదల చేస్తారని ఖరారు చేసుకోవచ్చు. ఇక చిరంజీవి తన తదుపరి చిత్రం కోసం పలువురు దర్శకులతో సంప్రదింపులు జరుపుతున్నారని, అయితే ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదని అంటున్నారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తమిళ బ్లాక్ బస్టర్ వేదాళం రీమేక్ భోళా శంకర్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన సోదరిగా కీర్తి సురేష్ కనిపించనున్నారు. ఆ తర్వాత ఆయనతో సినిమాలు చేసేందుకు పూరి జగన్నాథ్, సురేందర్ రెడ్డి, కళ్యాణ్ కృష్ణల పేర్లు వినిపిస్తున్నాయి కానీ భోళా శంకర్ తర్వాత చిరంజీవి చేయబోయే సినిమా గురించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.