మెగాస్టార్ చిరంజీవి నటించగా విడుదలకి సిద్ధంగా ఉన్న తాజా సినిమా “గాడ్ ఫాదర్”. మలయాళ భాషలో బ్లాక్ బస్టర్ హిటైయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కినది. నిజానికి లూసిఫర్ సినిమా తెలుగులో డబ్ అయినప్పటికీ, ఆ చిత్రానికి మన నేటివిటీకి అనుగుణంగా పలు మార్పులు చేసి.. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు మళ్లీ తెస్తున్నారు. ఈ చిత్ర మాతృక లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించారు. అదే పాత్రను ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి పోషించారు.
ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా.. ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పకురాలుగా ఉన్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్ ను ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
అయితే చివరి నిమిషంలో సాంకేతిక కారణాల వల్లనో ఇతర కారణాల వల్లనో టీజర్ విడుదల ఆలస్యం అయింది. కానీ సినిమా టీజర్ చాలా ఆలస్యంగా వచ్చి అభిమానులను కాస్త నిరుత్సాహానికి గురిచేసినా, టీజర్ చూసిన తరువాత మెగా అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
ఇక టీజర్ లో మునుపెన్నడూ లేని విధంగా స్టైలిష్ అవతార్‌లో చిరంజీవి కనిపిస్తున్నారు. అద్భుతమైన సాంకేతిక విలువలతో టీజర్ అద్భుతంగా ఉందని చెప్పాలి. ఇక ప్రస్తుత నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రోమాలు నిక్క బొడుచుకునెలా ఉంది. ఇలా బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. టీజర్ లో భాయ్ డైలాగ్స్ మరియు లుక్స్ ఆకట్టుకుంటాయి. చివరిలో కార్టూనిష్‌గా కనిపించే ఆ జీప్ షాట్ మినహా మిగతా టీజర్ సినిమా పట్ల ఆసక్తిని తదుపరి స్థాయికి పెంచిందనే చెప్పాలి.
ఆచార్య లాంటి డిజాస్టర్ తరువాత మెగాస్టార్ చిరంజీవికి ఒక గట్టి హిట్ తప్పనిసరి అవసరం. ఈ విషయంలో అభిమానులు కూడా కసి మీద ఉన్నారు. మరి అటు చిరంజీవి ఆశలను, అభిమానుల అంచనాలను అందుకునేలా గాడ్ ఫాదర్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అవ్వాలని ఆశిద్దాం.