శివరాత్రి సందర్భంగా ఈ వారం తెలుగు రాష్ట్రాల్లో చాలా సినిమాలు రిలీజ్ అవుతుండటంతో సినీ ప్రేమికులకు అసలైన విందు దొరకబోతుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే అన్ని సినిమాపూ ఒక్కో దానికి సంబంధం లేకుండా ఉండడంతో ప్రేక్షకులు ఏ ఒక్క సినిమా కూడా మిస్ కాకుండా అన్ని సినిమాలను చూసేలా ఆసక్తిని కలిగిస్తున్నాయి.
వెర్సటైల్ యాక్టర్ ధనుష్ కొత్త చిత్రం సార్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో దీనికి ‘వాతి’ అనే టైటిల్ పెట్టారు. ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో విడుదలైన అన్ని సినిమాలలో ఈ సినిమాకు ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ ఉంది.
ఇక మరో యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18న ఈ సినిమా విడుదల కానుంది.
సంతోష్ శోభన్, గౌరీ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ డ్రామా “శ్రీదేవి శోభన్ బాబు” ఫిబ్రవరి 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి దర్శకత్వం ప్రశాంత్ కుమార్ దిమ్మల నిర్వహించారు మరియు సంగీత దర్శకుడు సయ్యద్ కమ్రాన్ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం ద్వారా ’96’ స్టార్ గౌరీ కిషన్ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు.
హిందీలో కార్తీక్ ఆర్యన్ నటించిన షెహజాదా ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రం 2020 లో విడుదలైన తెలుగు చిత్రం అల వైకుంఠపురములో సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. పఠాన్ సినిమా తర్వాత హిందీలో విడుదలవుతున్న తొలి భారీ చిత్రం ఇదే కావడం విశేషం. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో రీమేక్ లు అంతగా ఆడకపోవడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందో చూడాలి.
మార్వెల్ స్టూడియోస్ యొక్క యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటానియా కూడా ఈ శుక్రవారం విడుదల కానుంది. 2023లో మార్వెల్ సినిమా విడుదల కావడం ఇదే తొలిసారి. ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొనడంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నాయి.
మాళవిక మోహనన్ కొత్త మలయాళ చిత్రం క్రిస్టీ కూడా ఫిబ్రవరి 17 శుక్రవారం విడుదల కానుంది. మొత్తమ్మీద ఈ వారం రకరకాల సినిమాల రిలీజ్ లతో థియేటర్లు నిండిపోనున్నాయి. మరి వీటిలో ఏ సినిమా ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలుస్తుందో వేచి చూడాలి.