కార్తీ నటించగా దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన సర్దార్ చిత్రం నిజానికి బాక్సాఫీస్ వద్ద కాస్త నెమ్మదిగా ప్రారంభమైంది. అయితే సినిమా చూసిన వారందరూ అద్భుతంగా ఉందన్న టాక్ పెరుగుతూ పోయింది.
దాంతో ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ రోజు నాటికి, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటింది. ఇక ఫుల్ రన్‌లో కూడా అదే జోరును కొనసాగించాలని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రానికి ఇటీవలే సక్సెస్ మీట్ నిర్వహించడం జరిగింది. కాగా ఆ సక్సెస్ మీట్ లో చిత్ర బృందం ఈ సినిమాకు సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. అంతే కాకుండా కొన్ని నెలల్లోనే సీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకు వెళ్లాలని భావిస్తున్నారు. నిజానికి సినిమా ఎండ్ టైటిల్స్ తర్వాత వచ్చే సన్నివేశంలోనే సీక్వెల్ కు సంభందించిన హింట్ ఇచ్చారు.
పీ ఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన సర్దార్ సినిమాలో కార్తీ రెండు ప్రధాన పాత్రల్లో నటించగా.. రాశి ఖన్నా, లైలా, రజిషా విజయన్ మరియు చంకీ పాండే ఇతర కీలక పాత్రలలో కనిపించారు.
కాగా సర్దార్ చిత్రం ఒక ఆసక్తికరమైన కథకు తోడు పకడ్బందీ కథనం కూడా ఉండడంతో ప్రేక్షకుల చేత బాగా ప్రశంసించబడింది. అలాగే అందరి ప్రేక్షకుల నుంచీ సానుకూల సమీక్షలను అందుకుంది.
సర్దార్ విజయంతో, పొన్నియన్ సెల్వన్ తర్వాత కార్తీ వరుసగా రెండవ వరుస హిట్ ఇచ్చారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో భారీ తారాగణం ఉన్నప్పటికీ.. కార్తీ తనదైన శైలిలో నటించి చక్కని ప్రశంసలు అందుకున్నారు. పొన్నియిన్ సెల్వన్ తమిళంలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇక వరుస విజయాల తరువాత, కార్తీ తన తదుపరి లైన్‌అప్‌లో కొన్ని అద్భుతమైన చిత్రాలను కలిగి ఉన్నారు. 2019 దీపావళికి విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఖైదీ సినిమా సీక్వెల్‌లో కార్తీ కనిపిస్తారు. లోకేష్ కనగరాజ్ ద్వారా రాబోతున్న ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎందుకంటే ఖైదీ సీక్వెల్ తో పాటు విక్రమ్ మరియు ఇతర సినిమాలని జత చేసి ఒక యూనివర్స్ తరహాలో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు లోకేష్. అందుకే ఈ చిత్రం ప్రస్తుతం కోలీవుడ్‌లో అత్యంత భారీ అంచనాలు ఉన్న సినిమాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కాగా ఈ చిత్రం 2023లో సెట్స్ పైకి వెళ్లనుందని కార్తీ ఇంతకు ముందే ధృవీకరించారు.