సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్ తో అలరిస్తారు. అయితే బయట మాత్రం ఆయన చాలా తక్కువ మాట్లాడుతారు అని.. కాస్త క్లోజ్ అయితే కానీ ఆయన ఎవరితోనూ అంతగా మాట్లాడరు అని చాలా మంది అంటుంటారు. అలాగే టెలివిజన్ ఈవెంట్స్, షోస్ కి మహేష్ గెస్ట్ గా రావడం చాలా అరుదు. తన సినిమా ప్రమోషన్స్, బ్రాండ్ ఎండార్స్ మెంట్ ఇంటర్వ్యూలకు మాత్రమే హాజరవుతూ ఉంటారు.
అయితే తాజాగా మహేష్ జీ తెలుగులో ప్రసారమైన డాన్స్ ఇండియా డాన్స్ రియాలిటీ షోకి గెస్ట్ గా వచ్చారు. కూతురు సీతారతో పాటు ఆయన హాజరయ్యారు. ఎన్నడూ లేని విధంగా మహేష్ గడ్డం, మీసాలతో ఒక కొత్త లుక్ లో కనిపించడం అందరిలోనూ ఆసక్తికర చర్చగా మారింది. అతి త్వరలో త్రివిక్రమ్ సినిమా మొదలవనున్న నేపథ్యంలో.. మహేష్ ఆ సినిమా కోసమే కొత్త లుక్ ను సిద్ధం చేస్ పనిలో ఉన్నారని ప్రేక్షకులు మరియు అభిమానులు అనుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, అసలు మహేష్ బాబు ఆ ఈవెంట్ కి గెస్ట్ గా రావడం వెనుక మరో కారణం కూడా ఉందంటున్నారు. మహేష్ తో జీ తెలుగు ఛానల్ భారీ డీల్ కుదుర్చుకుందట. ఆ ఒప్పందం ప్రకారం ఏడాది పాటు జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే వివిధ షోలు, ఈవెంట్లు మరియు సీరియళ్లలో కనిపించేందుకు గాను 9 కోట్ల భారీ ఆఫర్ మహేష్ కు ఇస్తున్నారట. ఈ క్రమంలో జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం అయ్యే సింగింగ్ షోస్, డాన్సింగ్ షోస్ ఫైనల్స్, ఇతర ప్రత్యేక ఈవెంట్స్ కి మహేష్ బాబు హాజరుకానున్నారట. ఇది ఒక రకంగా మహేష్ అభిమానులతో తో పాటు ప్రేక్షకులు ఆనందించాల్సిన విషయమే. ఎందుకంటే మహేష్ లాంటి స్టార్ ను తరచూ చూసే అవకాశం లభిస్తుంది కాబట్టి.
అయితే మహేష్ బాబు – జీ తెలుగు ఛానెల్ మధ్య డీల్ పట్ల మహేష్ అభిమానులు ఏ మాత్రం సంతోషంగా లేరని తెలుస్తోంది. పెద్ద హీరో అయి ఉండి ఇలా డాన్స్ షోలకు పాటల ప్రోగ్రాంలకు రావడం ఏంటని అభిమానులు బాధ పడుతున్నారు. స్టార్ హీరో అంటే ఒక స్థాయిని మెయింటైన్ చేయాలి కానీ ఇలా సీరియల్స్ లో లేదా ప్రతి ప్రోగ్రాంలో కనిపిస్తే అది ఆయన ఇమేజ్ కు ఏమాత్రం మంచిది కాదని మహేష్ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
ఇక మహేష్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. SSMB28 గా పిలవబడుతున్న మహేష్ ని సరికొత్తగా ప్రేక్షకులకి చూపించబోతున్నారు అని వినిపిస్తుంది. అలాగే వచ్చే ఏడాదలో రాజమౌళితో సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.