ఒక స్టార్ హీరో తన సినిమాకి తన నటనతో లేదా స్టార్డం తో భారీ క్రేజ్ సృష్టించి. ఆ సినిమాని విజయవంతం చేయడం సర్వ సాధారణంగా జరిగేదే. అందుకే వారిని నమ్మి నిర్మాతలు డబ్బు ఖర్చు చేసి సినిమాలు తీస్తుంటారు. అభిమానులు కూడా తమ హీరోను దేవుడిలా కొలుస్తుంటారు.
అయితే ఒక హీరో పదిహేనేళ్ల క్రితం నటించిన సినిమాను మళ్లీ విడుదల చేసి.. ఆ సినిమాను అభిమానులు మరియు ప్రేక్షకుల ఒక కొత్త సినిమా స్థాయిలో థియేటర్ల వద్దకు పరుగులు తీయడం మాత్రం సాధారణ విషయం కాదు.అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత సూపర్ స్టార్ మహేష్ బాబుకే దక్కుతుంది. ఇటీవల మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పోకిరి సినిమాను ఆయన అభిమానులు ప్రత్యేక షోలు వేసి సంబరాలు జరుపుకున్నారు.
పోకిరి స్పెషల్ షోల ద్వారా నిజంగానే అద్భుతం సృష్టించింది అని చెప్పచ్చు. 375+ షోలతో ఒక బ్లాక్ బస్టర్ సినిమా స్థాయిలో ఈ స్పెషల్ షోలను మహేష్ అభిమానులు సందడి చేశారు. ఇది స్పెషల్ షోలలో అత్యధిక రికార్డు. మహేష్ బాబు కెరీర్ లోనే మరపురాని సినిమా అయిన పోకిరిని చూడటానికి అభిమానులు థియేటర్లకు ఒక ప్రవాహంలా వచ్చారు.
అయితే అభిమానులు తమ హీరోకు అంత ప్రేమ కురిపించడం సహజమే.. కానీ ఇతర సాధారణ ప్రేక్షకులు కూడా సినిమాని చూశారు అంటే అది ఖచ్చితంగా పోకిరి సినిమా మరియు మహేష్ బాబు మ్యాజిక్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాక్సాఫీస్ వర్గాల ప్రకారంపోకిరి స్పెషల్ షోలు ప్రపంచ వ్యాప్తంగా 1.73 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఇది కొందరి హీరోల మొదటి రోజు ఓపెనింగ్ కలెక్షన్ల కంటే ఎక్కువ.
మాములుగా అభిమానులను మరియు ప్రేక్షకులను ఇలాంటి స్పెషల్ షోలు ఆకట్టుకుంటాయని తెలిసినా.. ఈ స్థాయిలో వాటికి ఆదరణ ఉంటుందనే విషయం పోకిరి వల్లే తెలిసింది. ఈ క్రమంలో కొంతమంది నిర్మాతలు కొన్ని పాత క్లాసిక్ హిట్‌లను మళ్లీ రిమాస్టర్ చేసి హీరోలకి సంభందించిన ప్రత్యేక రోజులలో ఆయా హిట్ సినిమాలను ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారట.
ఒక్కో స్టార్ హీరోకి అలాంటి ప్రత్యేకమైన సినిమాలు ఉండనే ఉన్నాయి. రామ్ చరణ్ కు రంగస్థలం, అల్లు అర్జున్ రేసు గుర్రం, మరియు అలా వైకుంఠపురములో, పవన్ కళ్యాణ్ ఖుషి, గబ్బర్ సింగ్, ఎన్టీఆర్ కు టెంపర్, ఇక ప్రభాస్ కు మిర్చి వంటి సినిమాలు ఈ స్పెషల్ షోలకు సరిగ్గా సరిపోయే సినిమాలుగా చెప్పుకోవచ్చు.