టాలీవుడ్ నంబర్ వన్ దర్శకుడు రాజమౌళి.. ఇటీవలే విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో అంచనాలు అందుకుని ప్రేక్షకులని ఆనంద డోలికలలో తేల్చిన విషయం తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులను మాత్రమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమా ఖ్యాతిని ప్రథమ స్థానంలో నిలబెట్టారు రాజమౌళి. ఇక అంతటి భారీ విజయం తరువాత కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ ఇప్పుడు తదుపరి సినిమాని ప్రారంభించే పనిలో పడ్డట్లుగా సమాచారం అందుతోంది.
ఆయన తదుపరి సినిమా మహేష్ బాబుతో చేయబోతున్నారు. దాదాపు పదేళ్ల నుంచి మహేష్ బాబుతో రాజమౌళి సినిమా గురించిన వార్తలు వచ్చాయి. అయితే ఇన్నేళ్ల తరువాత ఎట్టకేలకు వీరి కలయికలో సినిమా పట్టాలెక్కుతోంది. రాజమౌళి ప్రస్తుతం తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కలిసి స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టారట. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో దాదాపు అన్ని సినిమాలకి ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ ను అందించారు. ఇప్పుడు మహేష్ బాబు హీరోగా నటించే సినిమాకు కూడా ఆయనే రచయితగా వ్యవహరించబోతున్నారు.
రాజమౌళి ఇప్పటికే ఈ సినిమాకు ఒక మూల కథను సిద్ధం చేసుకోగా .. దాన్ని పూర్తి స్థాయి కథగా మార్చే పనిలో ఉన్నారు. ఇక ప్రస్తుతానికి ఈ సినిమా గురించి స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టారు. ఇప్పటి దాకా కేవలం కథ సిద్ధం అయ్యింది అనే వార్త మాత్రమే అందుతోంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వచ్చే అవకాశం వచ్చింది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాను భారీ యాక్షన్ మరియు ఫారెస్ట్ అడ్వంచర్ సినిమాగా దాదాపుగా 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమాలు మరి ఆ మాత్రం భారీ బడ్జెట్ అవుతుంది.
ఇక ఈ సినిమా చేయడం ఎంతో సంతోషం అని హీరో మహేష్ బాబు అన్నారు. రాజమౌళితో కలిసి పని చేయడం ఒక కల నిజం అయినట్లు ఉందని.. ఆయనతో ఒక్క సినిమా చేయడమే 25 సినిమాలకి పని చేయడంతో సమానం అని మహేష్ అనడం విశేషం. ఈ సినిమా కోసం శారీరకంగా కూడా ఎంతో కష్టపడాలి అని.. అందుకు తను కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్తూ.. ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భాషలకు అతీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటామని ఆశిస్తున్నట్లు మహేష్ తెలిపారు.