యువ హీరో నితిన్..ఎడిటర్ నుండి దర్శకుడిగా మారిన ఎం ఎస్ రాజశేఖర రెడ్డి దర్శకత్వంలో నటించిన మాచర్ల నియోజకవర్గం ఈ శుక్రవారం అంటే ఆగస్ట్ 12న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. మొదటి రోజునే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తొలి రోజు వరకూ బాక్స్ ఆఫీస్ వద్ద పరవాలేదు అనిపించినా.. రెండవ రోజు నుంచి మరీ దారుణంగా పడిపోయింది. విడుదలకు ముందు సినిమా పై మంచి హైప్ ఉన్నప్పటికీ, ప్రేక్షకులను సినిమా హాళ్ల వద్దకు రప్పించడంలో విఫలమైంది.
అందుకు ప్రధాన కారణం సినిమా మరీ మూస ఫార్ములాతో తెరకెక్కించడమే. దశాబ్ద కాలం నాటి సినిమాల తరహాలో పరమ రొటీన్ సన్నివేశాలు.. ఓవర్ ది టాప్ ఫైట్లు, త్రాసులో కొలిచినట్లు ఉండే పాటలు, కొన్ని కామెడీ సన్నివేశాలు మరియు పవర్ ఫుల్ మాస్ డైలాగ్స్ ఇలా ఎప్పుడో అరిగిపోయిన రికార్డు స్థాయిలో సినిమా రూపొందటం వలన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తిప్పికొట్టారు.
ఈ ఫార్ములా ఒకప్పుడు పని చేసేది ఏమో కానీ ప్రస్తుతం ప్రేక్షకులు అలాంటి ఫార్ములా కంటెంట్ చూడటానికి ఏమాత్రం సిద్ధంగా లేరు. సినిమాలో ఏదో ఒక కొత్తదనం లేదా ఆసక్తికరమైన విధంగా ఉంటేనే ప్రేక్షకులు థియేటర్ల వద్దకు పోటెత్తుతారు అనడానికి సీతా రామం, బింబిసార చిత్రాల విజయమే నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
ఇక మాచర్ల నియోజకవర్గం సినిమా మరో నాలుగు వారాల్లో ఓటిటి విడుదలకు సిద్ధంగా ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సెప్టెంబర్ 9న అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫామ్‌లో ఈ చిత్రం విడుదల కానుందట. అంటే 4 వారాల గ్యాప్ తర్వాత ఓటీటీలో సినిమాను విడుదల అవుతుంది అన్నమాట. ఇటీవల తెలుగు సినిమా నిర్మాతల మండలి సూచనల మేరకు ఆరు వారాల తరువాత సినిమాని విడుదల చేయాలనే నిబంధనకు విరుద్ధంగా విడుదల అవుతుంది. అదేంటని అడిగితే చాలా సింపుల్ గా జూలై నెల కంటే ముందే ఓటిటి ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్తారు కావచ్చు.
మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలు గా నటించగా, సముద్రఖని విలన్ పాత్రను పోషించారు. ఈ చిత్రానికి రాజశేఖర్ రెడ్డి దర్శకుడు కాగా మహతి స్వర సాగర్ సంగీత దర్శకుడుగా పని చేశారు.