విక్రమ్ సినిమా సాధించిన అద్భుతమైన విజయం వల్ల ఆ చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఒక్కసారిగా అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయారు. ఈ యువ దర్శకుడు ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న దక్షిణ భారత దర్శకులలో ఒకడు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అలాగే ఆయన నుంచి తదుపరి రానున్న సినిమాలు కూడా ఎంతో ఆసక్తికరమైన విదంగా ఉన్నాయి.
ఇక దక్షిణాది రాష్ట్రాల్లో అద్భుతమైన మార్కెట్‌ను సంపాదించుకున్నారు గనక ఇప్పుడు హిందీ మార్కెట్‌లో కూడా తన మార్కెట్ ను సృష్టించుకొవాలి అని చూస్తున్నారు లోకేష్. అందుకే తాను తదుపరి విజయ్‌తో చేయబోయే సినిమా కోసం సంజయ్ దత్‌ని విలన్‌గా తీసుకున్నారని సమాచారం. ఈ చిత్రం 2023లో విడుదల కానుంది. అంతే కాక ప్రస్తుతం తమిళ సినిమా పరిశ్రమలో అత్యంత చర్చనీయాంశమైన సినిమాలలో ఒకటిగా నిలిచింది.
సంజయ్ దత్ తాజాగా ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయిన కేజీఫ్-2 లో అధిరా పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇక ఓకే సినిమాలో ఇద్దరు స్టార్లను హ్యాండిల్ చేయడం దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. మాస్టర్ సినిమాలో తమిళ సూపర్ స్టార్ విజయ్ మరియు విజయ్ సేతుపతి కాంబినేషన్ ను సమర్థవంతంగా నిర్వర్తించిన లోకేష్, విక్రమ్ లో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ వంటి మేటి తారలను కూడా చక్కని ఆసక్తికరమైన పాత్రలలో చూపించారు.కాగా దళపతి67 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం పిలవబడుతున్న ఈ చిత్రంలో సమంత, ప్రియాంక అరుల్ మోహన్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
దళపతి67 ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. కాగా విశ్వసనీయ వర్గాల నివేదికల ప్రకారం, ఈ సినిమాలో విలన్‌గా నటించేందుకు గానూ సంజయ్ దత్‌కు 10 కోట్ల రూపాయల భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా హీరో విజయ్ కు, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు మంచి విజయం సాధించాలని కోరుకుందాం.