సినిమా ఇండస్ట్రీలో హిట్లు ప్లాపులు అనేవి సర్వ సాధారణం. ఎందుకంటే ఇది గ్యారంటీ లేని ఇండస్ట్రీ. పక్కా హిట్ అనుకున్న సినిమాలు అట్టర్ ఫ్లాప్ లు అవడం.. అసలు ఆడుతుందో లేదో అనుమానం ఉన్న సినిమాలు సూపర్ హిట్ లు అవడం చాలా సార్లు జరిగింది.. ఇక ముందు కూడా అలానే ఉంటుంది. ఐతే ఒక సినిమా విజయం సాధిస్తే ఆ చిత్రానికి సంభందించిన అందరూ లాభాల బాట పడతారు. అదే పరాజయం పాలైతే నష్టాలను మూటగట్టుకుంటారు. ఒక్కో సారి భారీ డిజాస్టర్స్ సినిమాలు వస్తుంటాయి. ఆ సమయాల్లో భారీ రేట్లకు కొనుగోలు చేసిన బయ్యర్లు మాత్రం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అలాంటప్పుడే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య సమస్యలు మొదలవుతాయి.
ఎందుకంటే కొందరు నిర్మాతలు లేదా హీరోలు తమకి సినిమా పట్ల, పరిశ్రమ పట్ల ఉన్న బాధ్యతతో ఆయా నష్టాలలో కొంత వరకు భర్తీ చేస్తుంటారు.. అది డబ్బు తిరిగి ఇచ్చే రూపంలో అయినా కావచ్చు లేదా తదుపరి సినిమాకు రేట్లు సర్దుబాటు చేయడం కావచ్చు ఒక్కొక్కరూ ఒక్కో పద్ధతిని అనుసరిస్తుంటారు. కొందరు నిర్మాతలు మాత్రం ఇలాంటి విషయాల్లో సరిగ్గా స్పందించకుండా వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో తాజాగా ఒక సినిమా భారీ పరాజయం పాలయింది.
ఇటీవల కాలంలో భారీ అంచనాలతో విడుదలైన “లైగర్” బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా సినిమాగా నిలిచిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే జంటగా నటించారు. ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి పూరీ కనెక్ట్స్ బ్యానర్ పై పూరీ మరియు ఛార్మీ కౌర్ ఈ సినిమాని నిర్మించారు.
ప్యాన్ ఇండియా స్థాయిలో ఆగస్ట్ 25న రిలీజ్ అయిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ‘లైగర్’ ఫలితం దారుణంగా వచ్చిన తరువాత డిస్ట్రిబ్యూటర్లకు మరియు పూరీ- ఛార్మీల మధ్య నష్టాలకు సంభందించి రకరకాల వార్తలు వచ్చాయి.
రిలీజ్ కు ముందు ‘లైగర్’ చుట్టూ నెలకొన్న అద్భుతమైన హైప్ వల్ల బయ్యర్లు ఆ చిత్రాన్ని అధిక రేట్లకు ఈ చిత్రాన్ని కొనుగోలు చేశారు. అయితే సినిమా డిజాస్టర్ అవడంతో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ భారీ నష్టాలను చవిచూశారు. దీంతో పూరీ మరియు ఛార్మి వారికి పరిహారం చెల్లించడానికి ముందుకు వచ్చారని ఆ మధ్య వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం పూరి జగన్నాథ్, లైగర్ సినిమా నష్టాలను తీర్చే పని ప్రారంభించారట, అయితే ఆయన నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కానీ డిస్ట్రిబ్యూటర్లు ఆయన తిరిగిచ్చే అమౌంట్ తో సంతోషంగా లేరని సమాచారం. డిస్ట్రిబ్యూటర్లు తెలుగు రాష్ట్రాలకు పరిహారంగా 25కోట్ల భారీ మొత్తాన్ని అడుగుతుండగా పూరీ మాత్రం అందులో సగం మాత్రమే ఇచ్చేందుకు పూరీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం ఎక్కడ ఆగుతుందో చూడాలి.
ఇకపోతే ‘లైగర్’ ప్లాప్ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ – పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కాల్సిన ‘జనగణమన’ సినిమా దాదాపు ఆగిపోయినట్లే అంటున్నారు. నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. అధికారిక ప్రకటన ఏదీ రాకపోయినా.. ఈ సినిమా ఆగిపోయిన వార్త దాదాపు ఖరారు చేసుకోవచ్చని అంటున్నారు