ప్రముఖ తెలుగు నటి, మాజీ పార్లమెంటేరియన్ జె.జమున వృద్ధాప్యం ఈరోజు హైదరాబాద్ లోని తన నివాసంలో కన్నుమూశారు. అయితే వయసు పైబడడం వల్ల స్వల్ప అనారోగ్యం తప్ప ఆమెకు ఎటువంటి సమస్యలు లేవని, చాలా ప్రశాంతంగానే తుది శ్వాస విడిచారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 200 చిత్రాల్లో నటించిన 86 ఏళ్ల జమునకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
‘తెలుగు సినిమా స్వర్ణయుగం’ లో ఒక వెలుగు వెలిగిన నటి జమున ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు వంటి మొదటి తరం తెలుగు తారలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 1953లో ‘పుట్టిల్లు’ చిత్రంతో ఆమె తెరంగేట్రం చేశారు.
సావిత్రి, ఏఎన్నార్, ఎన్టీఆర్, ఎస్వీ రంగారావులతో కలిసి నటించిన కల్ట్ క్లాసిక్ ‘మిస్సమ్మ’తో జమున స్టార్ డమ్ సంపాదించుకున్నారు. మూగ మనసులు, శ్రీకృష్ణ తులాభారం, అప్పుచేసి పప్పు కూడు, భాగ్యరేఖ, దొంగ రాముడు వంటి ఎన్నో క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ లో నటించి ప్రేక్షకులని మెప్పించారు.
ఇక కేవలం నటనలోనే కాకుండా రాజకీయాల్లో కూడా జమున రాణించారు. ఆమె 1989లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్ తరఫున లోక్ సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి కాస్త విరామం తీసుకుని 90వ దశకం చివర్లో బీజేపీ తరఫున ప్రచారం కూడా చేశారు.