తమిళ హీరో విజయ్ వారిసు సంక్రాంతి విడుదల వ్యవహారం రోజురోజుకూ వివాదాస్పదం అవుతోంది. మెగా, నందమూరి ఫ్యామిలీకి చెందిన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులకి విజయ్ అభిమానులకు మధ్య మాటల యుద్ధం మొదలైంది. అయితే, థియేటర్ల కేటాయింపుల వివాదం ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు మరియు తమిళ చిత్ర పరిశ్రమకు విస్తరించింది. ఈ సంఘర్షణ ఉధృతంగా వృద్ధి చెందింది. అంతే కాకుండా బాధ్యతాయుతమైన వాటాదారులు జోక్యం చేసుకొని స్పష్టత ఇవ్వకుంటే ఈ వివాదం మరింత ముదిరే ప్రమాదం ఉంది.
ఈ సమస్యకు కేంద్రంగా వారిసు సినిమా నిర్మాత దిల్ రాజు ఉన్నారు. 2019 సంక్రాంతి సందర్భంగా తెలుగు సినిమాల కోసం థియేటర్‌లను బ్లాక్ చేయడాన్ని సమర్థిస్తూ ఆయన చేసిన ప్రకటన.. ప్రస్తుతం వారిసుకు భారీ సంఖ్యలో థియేటర్లు కేటాయించినందుకు గానూ మళ్లీ తెరపైకి వస్తోంది.
వారిసు (తెలుగులో వారసుడు) సినిమాకు దిల్ రాజు మంచి క్వాలిటీ థియేటర్లు ఇవ్వడాన్ని బాలయ్య, చిరంజీవి అభిమానులు వ్యతిరేకిస్తున్నారు.
తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని దిల్ రాజుకు ఇచ్చిన సూచనకు సంబంధించి తెలుగు నిర్మాతల మండలి ప్రకటన పై.. తాజాగా తమిళ నిర్మాతల మండలి ఘాటుగానే స్పందించింది.
బీస్ట్ సినిమా విడుదలైనప్పుడు పక్కన KGF2 వంటి ఇతర భాషా చిత్రాలు ఉన్నా తాము ఎప్పుడూ వివక్ష చూపలేదని తమిళ మండలి పేర్కొంది. ఈ విధంగా తెలుగు నిర్మాతలు డబ్బింగ్ సినిమాగా పరిమితం చేయకుండా వారిసు సినిమాని ప్రోత్సహించి మాగ్జిమమ్ ఫ్రీహ్యాండ్ ఇవ్వాలని వారు కోరుతున్నారు.
అయితే తెలుగు నిర్మాతల మండలి, తమిళ నిర్మాతల మండలి చిన్న విషయానికి అనవసర వివాదాలు సృష్టిస్తున్నాయి. ఎవరికి ఎక్కువ థియేటర్ల పై ఆధిపత్యం ఉంటే వారికే థియేటర్లు అత్యధికంగా కేటాయిస్తారనే విషయం అందరికి తెలిసిందే. ఈ అనవసరమైన చర్చ ఏ సినిమాలకు కూడా సహాయం చేయదు.
అలాగే, ప్యాన్ ఇండియా సినిమాలు దేశాన్ని ఊపేస్తున్నప్పుడు, మన మార్కెట్‌ను బయటి వ్యక్తులకు పరిమితం చేస్తే.. ఇతర పరిశ్రమ వాళ్ళు తమ మార్కెట్ లోకి స్వాగతీస్తారని మనం ఆశించలేము. ప్రాంతీయ భేదాలు పక్కన పెట్టేసి ఒక్కటిగా కలిసి ఉంటేనే అందరికీ మంచిది.