2022లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమాల్లో రెండు కన్నడ ఇండస్ట్రీ నుంచే రావడం విశేషం. అందులో ఒకటి కేజీఎఫ్ 2 కాగా మరో సినిమా కాంతార. కేజీఎఫ్ 2 అయితే రూ.1200 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్లింది. ఇక చిన్న సినిమాగా రిలీజైన కాంతార ఏకంగా రూ.400 కోట్ల వసూళ్లతో ప్రపంచ వ్యాప్తంగా సంచలనమే సృష్టించింది.
ఈ రెండు సినిమాలను నిర్మించింది హోంబలే ఫిల్మ్సే. అయితే కాంతారలో కీలకపాత్ర పోషించిన కిషోర్ అనే నటుడు ఇప్పుడు కేజీఎఫ్ 2 పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి దారి తీశాయి. అదొక చెత్త సినిమా అని, అలాంటి సినిమా చూసే బదులు తాను చిన్నదైనా సరే ఓ సీరియస్ కథాంశం ఉన్న సినిమా చూస్తానని కిషోర్ అన్నారు. ఇంత వరకూ తాను కేజీఎఫ్ 2 సినిమాను తాను చూడలేదని కూడా ఆయన స్పష్టం చేశారు.
కాంతార సినిమాలో కిశోర్ ఫారెస్ట్ ఆఫీసర్ రోల్ పోషించిన విషయం తెలిసిందే. ఆయన ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ.. ” ఇలా అనడం సరైనదో కాదో తెలియదు కానీ నేను కేజీఎఫ్ 2 చూడలేదు. అది నా టైప్ సినిమా కాదు. అది నా వ్యక్తిగత విషయం. ఇలాంటి ఓ మైండ్ లెస్ సినిమా కంటే పెద్దగా సక్సెస్ కాని సీరియస్ అంశాన్ని డీల్ చేసే ఓ చిన్న సినిమాను చూస్తాను” అని అన్నారు.
కన్నడ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు రెండూ ఘన సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ ఈ తెరకెక్కించారు. ఇక రిషబ్ శెట్టి డైరెక్షన్‌లో వచ్చిన కాంతార సినిమా కేవలం రూ.15 కోట్లతో తెరకెక్కి.. రూ.400 కోట్లకుపైగా వసూలు చేసింది.
2022లో ఈ సినిమాతోపాటు పొన్నియిన్ సెల్వన్, షి సీజన్ 2 వెబ్ సిరీస్‌ల ద్వారా కిషోర్ పేరు సంపాదించారు. కాగా ఆయన త్వరలోనే రెడ్ కాలర్ అనే హిందీ సినిమాలో కూడా కనిపించనున్నారు.
కిషోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ‘కాంతార’ భారీ విజయం తరువాత, చాలా మంది బిజెపి నాయకులు సినిమా చూసి కంటెంట్ ను ప్రశంసించారు. వాస్తవానికి, ‘బూత కోలా’ హిందూ సంస్కృతిలో భాగమని రిషబ్ శెట్టి చెప్పారు.
అయితే, కిషోర్ ఈ విషయం పై భిన్నమైన వైఖరిని కలిగి ఉన్నారు మరియు “ద్వేషం యొక్క బ్రోకర్ల” బారిన పడవద్దని ప్రజలను ఒక సందర్భంలో పరోక్షంగా బీజేపీ నాయకులను నమ్మొద్దు అంటూ ప్రజలని ఆయన హెచ్చరించారు.
‘కెజిఎఫ్’ సిరీస్ కన్నడ చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా పరిగణించబడుతున్నందున కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఆ సినిమా అభిమానులకు షాక్ ఇచ్చాయి, నిజానికి కేజీఎఫ్ వల్లే కన్నడ చిత్ర పరిశ్రమకు జాతీయ ప్రాముఖ్యత వచ్చింది అని వారు భావిస్తున్నారు.