అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’లో ఓ మేజర్ ట్విస్ట్ ఉండబోతుందని సమాచారం. ఈ సినిమా కథలో, కథనంలో ఈ ట్విస్ట్ ఒక ప్రధానాంశంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండగా.. ఈ కొత్త వార్త మరింత ఆసక్తిని కలిగిస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.
‘పుష్ప’ మొదటి భాగంలో కీలక పాత్రల్లో కేశవ ఒకటని మనకు తెలుసు. కాగా పుష్ప రెండవ భాగంలో ఆయన పాత్ర మరింత కీలకం కానుందని తెలుస్తోంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇందులో ఫహద్ ఫాసిల్ యొక్క షెకావత్ సింగ్ పాత్ర కంటే కేశవ పాత్ర ఎక్కువ బరువు ఉంటుందని అంటున్నారు.
రెండో భాగంలో కేశవ పాత్ర నే మొత్తంగా హైలైట్ గా నిలుస్తుందని సమాచారం. మొదటి భాగంలో బాగా ఎస్టాబ్లిష్ అయిన కేశవ పాత్ర రెండో భాగంలో పుష్ప రాజ్ కు వెన్నుదన్నుగా ఉంటూనే మోసం చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. అందుకే సినిమాలో వాయిస్ ఓవర్ ను పుష్ప కోణంలో కాకుండా తన కోణంలోనే చెప్పించారని అంటున్నారు.
అంతే కాదు రెండో భాగంలో పుష్పకు, అతని ప్రత్యర్థులకు మధ్య పోటాపోటీ సన్నివేశాలు మరియు అద్భుతమైన పోరాట ఘట్టాలు మరో స్థాయిలో ఉంటాయని, కాగా మొదటి భాగంతో పోలిస్తే ఈ భాగంలో మరిన్ని కొత్త పాత్రలు కనిపిస్తాయని వినికిడి.
సుకుమార్ ఈ ప్రాజెక్టును పూర్తి చేసే తొందరేమీ పడకుండా ప్రతి విషయంలోనూ తనను సంతృప్తి పరిచిన తర్వాత మాత్రమే షూటింగ్ లో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారట. అందుకే తనదైన స్పీడులోనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే టైటిల్ కి తగ్గట్టుగానే పుష్ప ఎదుగుదలను ఈ సినిమా మరింత ఎత్తుకు తీసుకెళ్తుంది.
పుష్ప ది రూల్ లో రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ మొదటి పార్ట్ లో చేసిన పాత్రలను కొనసాగిస్తారు. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.