తెలుగు సినిమా పరిశ్రమలోని టైర్ 2 యువ హీరోల్లో నిఖిల్ సిద్ధార్థ్ ఒకరు. గత వారం నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సాధించిన ఘనత గురించే ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. నిఖిల్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన కార్తీకేయ 2, అక్కడితో ఆగకుండా తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి చేర్చింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
2014 లో వచ్చిన కార్తికేయ సూపర్ హిట్ గా నిలిచింది. ఆ చిత్రానికి సీక్వెల్ గా కార్తికేయ 2 తెరకెక్కించారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన చందూ మొండేటి నే సీక్వెల్ కి కూడా బాధ్యతను మోశారు. ఈ సినిమా వల్ల నిఖిల్ కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది.
యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో వచ్చిన కార్తీకేయ 2 ప్రేక్షకులను విశేష స్థాయిలో ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ అయ్యింది.ఆగస్టు 13న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రచార కార్యక్రమాల సమయంలో చిత్ర బృందం ఈ సినిమా విజయం మీద ఉన్నప్పటికీ, విడుదల తేదీ పలు మార్లు వాయిదా పడటం వల్ల ఒక దశలో మాత్రం తీవ్ర ఒత్తిడిని ఎదురుకున్నారు.
అయితే సినిమా విడుదల అయిన తరువాత వారి నమ్మకమే గెలిచింది. ఈ సినిమా సంచలన స్థాయిలో హిట్ గా ముద్రను వేసుకోవడంతో ఆశ్చర్యపోవడం అందరి వంతూ అయింది.అంతే కాకుండా ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే పెట్టుబడిని రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. రెండో వారంలో కూడా ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితం అవుతుంది.
ఇక హిందీలో అయితే అనూహ్యంగా ఈ చిత్రం ఆదరణకు నోచుకుంది. ఈ సినిమాలో శ్రీకృష్ణుడి గొప్పతనం గురించి చాటి చెప్పడంతో ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాకు అభిమానులు అయిపోయారు. ఉత్తరాదిన కార్తీకేయ 2 ప్రభంజనానికి అడ్డే లేకుండా పోయింది. రిలీజ్ అయిన 9వ రోజు 4 కోట్ల రూపాయలను వసూలు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది.
ఇప్పటి వరకూ తన థియేట్రికల్ రన్ లో 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇంకా జోరు తగ్గలేదు అన్న తరహాలో తన హవాను కొనసాగిస్తోంది. ఈ ఊపు చూస్తుంటే త్వరలోనే 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఎంతైనా ఉంది.
ఒకవేళ అదే గనక జరిగితే హీరో, నిఖిల్, చిత్ర బృందం తో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు కూడా చాలా సంతోషిస్తారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు.