యువ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా అందరి అంచనాలకు మించి అద్భుతంగా ప్రదర్శనను కొనసాగిస్తుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఒకదాని తర్వాత మరో మైలురాయిని దాటుతూ దూసుకు పోతుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ మార్కెట్‌లోనూ భారీ విజయాన్ని అందుకుంది. కార్తికేయ 2 హిందీ మార్కెట్‌లో మొదటి రోజు చాలా తక్కువ స్క్రీన్‌లలో ప్రదర్శించబడింది . కానీ ప్రేక్షకుల నుండి అద్భుతమైన మౌత్ టాక్‌తో, సినిమాను ఎక్కువ మంది చూడాలి అనే డిమాండ్ పెరగడంతో రోజు రోజుకూ స్క్రీన్‌ల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
యాక్షన్-అడ్వెంచర్ నేపథ్యంలో శ్రీకృష్ణుడి కాలం నాటి ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తొలి వారం హిందీ మార్కెట్లో 5.75 కోట్ల నెట్ వసూలు చేసింది. కాగా మొదటి వారాంతంలో 9.57 కోట్ల రూపాయల భారీ వసూళ్లు రాబట్టింది. ఇక తొమ్మిదవ రోజు సినిమా ఏకంగా 4.07 కోట్ల రూపాయలను తెచ్చిపెట్టింది. మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు హిందీలో కార్తీకేయ 2 15 కోట్ల నెట్ ను రాబట్టింది.
కలెక్షన్లు ఇలా ఎక్కడా తగ్గకుండా బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీగా ఉన్నాయి. అంతే కాకుండా రెండవ వారాంతంలో మొదటి వారం కంటే రెట్టింపు కలెక్షన్లు రావడం విశేషం. ఇది అత్యంత అరుదైన రికార్డు గా చెప్పుకోవచ్చు. 2014 లో వచ్చిన కార్తీకేయ చిత్రానికి సీక్వెల్ అయిన కార్తికేయ 2 లో నిఖిల్ ప్రధాన పాత్రలో నటించగా.. అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ రెడ్డి మరియు అనుపమ్ ఖేర్ కూడా కీలక పాత్రల్లో నటించారు.
నిఖిల్ నటనతో పాటు, చందూ మొండేటి దర్శకత్వ ప్రతిభ , ఆసక్తికరమైన కథనంతో పాటు కాల భైరవ అద్భుతమైన నేపథ్య సంగీతం మరియు ఆహ్లాదకరమైన విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. విడుదల ముందు చిత్ర బృందం అనేక ఇబ్బందులను ఎదురుకున్నా.. చివరికి ఫలితం మాత్రం వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.