కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తన అభిమానులను, సినీ ప్రేక్షకులను విడిచిపెట్టి నేటికి ఏడాది పూర్తయింది. కానీ కన్నడిగులు ఆయనను ఇంకా మరచిపోలేదు. అభిమానులు ఆయనను గుర్తు తెచ్చుకొని రోజులు ఉండవు అంటే అది అతిశయోక్తి కాదు.
ఇటీవల ‘పునీత పర్వ’ పేరిట పునీత్ రాజ్‌కుమార్ ఉత్సవం జరిగింది. ఆ ఉత్సవానికి సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ సహా భారతీయ సినిమా సూపర్ స్టార్లు కూడా హాజరయ్యారు. ఇప్పుడు నవంబర్ 1న పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతరం కర్ణాటక రత్న అవార్డును ప్రదానం చేయనున్నారు.
నవంబర్ 1న విధానసౌదలో ఈ అవార్డు ప్రదానోత్సవం జరగనుంది. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఈ కార్యక్రమానికి హాజరు కానున్న అతిథుల జాబితాలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొణె కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
పునీత్ ప్రథమ సంవత్సర స్మారకోత్సవం సందర్భంగా ఈ అవార్డును అందజేయడం విశేషం. పునీత్ తరపున ఆయన సతీమణి అశ్విని పునీత్ రాజ్‌కుమార్ అవార్డును అందుకోనున్నారు. ఇక డా. రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులు ఈ ఘట్టాన్ని వీక్షించనున్నారు.
అలాగే పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళులర్పించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలన్న అభిమానుల డిమాండ్‌పై సీఎం బసవరాజ బొమ్మై స్పందించారు. నవంబర్ 1 తర్వాత బెంగళూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 10 రోజుల పాటు మొత్తం 3 కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీఎం బొమ్మై తెలిపారు.
భారతరత్న జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారం. అలాగే రాష్ట్ర స్థాయిలో ‘కర్ణాటక రత్న’ అత్యున్నత పురస్కారం. ఏ రంగంలోనైనా విశేషమైన విజయాలు సాధించిన ప్రముఖులకు కర్ణాటక ప్రభుత్వం ఈ అవార్డును అందజేస్తుంది. కర్ణాటక రత్న అవార్డును 1992లో స్థాపించారు. ఇప్పటి వరకు 9 మందికి కర్ణాటక రత్న అవార్డు లభించింది. కాగా 1992లో డా. రాజ్‌కుమార్‌కు కర్ణాటక రత్న అవార్డు లభించింది.
ఇక పునీత్ అభిమానులు ఆనందించే మరో విషయం ఉంది. అదేంటంటే పునీత్ రాజ్‌కుమార్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘గంధాడ గుడి’ అనే డాక్యుమెంటరీ అక్టోబర్ 28న విడుదల కానుంది. కాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలవుతోంది అని గతంలో అనుకున్నా తరువాత అభిమానుల కోసం ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు.
గంధాడ గుడి సినిమాకి ఒక రోజు ముందు అంటే 27న చాలా చోట్ల ప్రీమియర్ షోలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే టికెట్ బుకింగ్ ప్రారంభం కాగా, అభిమానులు భారీ స్థాయిలో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. పునీత్ రాజ్‌కుమార్‌ను తెర పై చూడాలని అభిమానులు ఎంతో ఆశపడుతున్నారు