ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం కాంతార భారతదేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం కేవలం కర్ణాటకలోనే కాదు యావత్ భారతదేశం అంతటా ప్రకంపనలు సృష్టించింది. ఒక రకంగా ఇటీవలే విడుదలైన తెలుగు సినిమా కార్తికేయ 2 సినిమాకు జరిగినట్లే దీనికి కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో స్టార్ కంటే కూడా కంటెంట్ ఎక్కువగా మాట్లాడింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు దాటేసి తన జోరును ఇంకా కొనసాగిస్తోంది.
ఈ సినిమాకి లభిస్తున్న విపరీతమైన ఆదరణను నిర్మాతలు ఇతర భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రం యొక్క హిందీ వెర్షన్ నిన్ననే విడుదలైంది. అంతే కాకుండా ఇటీవల విడుదలైన కొన్ని హిందీ సినిమాల కంటే మెరుగ్గా ప్రదర్శించబడటం విశేషం.
కాంతార సినిమాని నిర్మించింది మరెవరో కాదు.. ఇటీవలే కేజీఎఫ్-2 వంటి ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ను అందించి తదుపరి ప్రభాస్ తో సాలార్ సినిమాని కూడా నిర్మిస్తున్న హోంబలే ఫిలింస్ సంస్థ. అందువల్లే, ప్రభాస్ ఈ చిత్రం విడుదల సమయంలో కాంతారను వీక్షించారు. మరియు చిత్రం పై గొప్ప ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా తెలుగులో రేపు విడుదల కానున్న నేపథ్యంలో మరోసారి సినిమాను వీక్షించి తన అభిప్రాయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేశారు.
రెబల్ స్టార్ మాట్లాడుతూ, “కాంతారను రెండవసారి చూశాను. ఇది ఎంతో అసాధారణమైన అనుభవం! గొప్ప కాన్సెప్ట్ మరియు థ్రిల్లింగ్ క్లైమాక్స్. థియేటర్లలో తప్పక చూడాల్సిన సినిమా! ఒక గొప్ప వ్యక్తి ఒకసారి అన్నాడు, “ఒక సినిమాని పాన్-ఇండియన్‌గా తీయకూడదు, అది పాన్-ఇండియన్‌గా మారాలి.” కాంతార లాంటి సినిమాలే ఆ మాటకు గొప్ప నిదర్శనం అని ప్రభాస్ అభిప్రాయపడ్డారు.
నిజానికి ఒకప్పుడు కన్నడ సినీ పరిశ్రమలో ఇతర భాషల నుంచి సినిమాలు రీమేక్ చేయడానికే ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పుడు అక్కడ ట్రెండ్ మారింది. కేజిఎఫ్ దెబ్బతో కన్నడ సినీ పరిశ్రమ వంక మిగతా భాషల పరిశ్రమలు చూడటం మొదలు పెట్టాయి. దాంతో అక్కడి దర్శక నిర్మాతలు తమ ఒరిజినల్ కథలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. అందువల్లే అవి అత్యంత ప్రజాదరణను పొందుతున్నాయి.