చిన్న కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారడం తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్తేమీ కాదు. అలాగే కొందరు కమెడియన్లు హీరోలుగా మాత్రమే కాకుండా దర్శకులుగా మారి మెగాఫోన్ కూడా పట్టారు. ఇక ప్రముఖ కామెడీ టీవీ షో జబర్దస్త్ నుండి చాలా మంది ఆర్టిస్టులు హీరోలుగా, దర్శకులుగా సినిమాలు చేసినప్పటికీ వారిలో ఎవరూ హీరోగా కానీ, దర్శకుడిగా కానీ సరైన ప్రభావాన్ని చూపడంలో సక్సెస్ కాలేక పోయారు.
కానీ జబర్దస్త్ ఫేమ్ కమెడియన్ వేణు మాత్రం తన తొలి సినిమా బలగంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. తన మొదటి సినిమాతోనే భావోద్వేగాలు, వినోదం మేళవింపును చక్కగా అమర్చడంతో పాటు చాలా నిజాయతీగా సినిమాను అందించారని, ప్రేక్షకులు మరియు విమర్శకుల చేత ప్రశంసలు అందుకుంటున్నారు.
ఇండస్ట్రీలో మంచి దర్శకుడిగా నిలదొక్కుకునే సత్తా తనకు ఉందని తోలి సినిమాతోనే నిరూపించుకున్నారు వేణు. తన మేకింగ్ స్టైల్ తో ఇండస్ట్రీ వర్గాల్లో కూడా భారీ ప్రశంసలు అందుకుంటున్న ఆయన తదుపరి చిత్రాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, వేణు, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో రచ్చ రవి, రోహిణి తదితరులతో పాటు దర్శకుడు వేణు కూడా ఒక సహాయక పాత్రలో నటించారు.
బలగం సినిమా కథ విషయానికి వస్తే.. సాయిలు (ప్రియదర్శి) అనే యువకుడు అనేక వ్యాపార ప్రయత్నాల్లో తన వంతు ప్రయత్నం చేసినా విజయం సాధించలేక పోతాడు. కట్నం కోసం పెళ్లి చేసుకుని ఆ డబ్బును వ్యాపారానికి ఉపయోగించాలని తను ప్లాన్ చేస్తాడు. కానీ తాత కొమురయ్య చనిపోవడంతో అది నిశ్చితార్థం రద్దవడానికి దారి తీస్తుంది. ఆ తర్వాత రెండు కుమ్ములాటల కుటుంబాలను పరిష్కరించి అందరూ దగ్గర అవడానికి సాయిలు ఏం చేస్తాడు, ఎలాంటి పథకాలు అమలు చేస్తాడు అనేదే మిగతా సినిమా.