సినీ సెలబ్రిటీలు, ప్రముఖ సినీ నిర్మాణ సంస్థల పై ఐటీ దాడులు జరగడం కొత్తేమీ కాదు. అయితే ఈ ఏడాదిలో రెండోసారి నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయాల పై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.
మైత్రి కార్యాలయాలతో పాటు సుకుమార్ కార్యాలయం, నివాసాలను కూడా ఐటీ అధికారులు ‘సర్వే’ చేశారని అంటున్నారు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ప్రస్తుతం ఎన్నో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం మైత్రీ మూవీస్ వారు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2 ది రూల్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సుకుమార్ “పుష్ప 2” చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. అలాగే ఇతర సినిమాలకు రచయితగా, నిర్మాతగా పలు చిన్న, మీడియం బడ్జెట్ నిర్మాణాలలో పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో తెరకెక్కిన సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రం ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈరోజు జరిగిన ఐటీ దాడుల ప్రభావం పుష్ప-2 పై పడింది. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైన ‘పుష్ప 2 ది రూల్’ షూటింగ్ ను సుకుమార్ ఈ నేపథ్యంలో క్యాన్సిల్ చేశారు.
ఇక హఠాత్తుగా జరిగిన ఐటీ దర్యాప్తులు మరియు దాడుల పర్యవసానాల పై పరిశ్రమ వర్గాలు ఊహాగానాలు చేస్తున్నాయి. ఐటీ అధికారులు ఏం కనుగొంటారు? సుకుమార్ భవిష్యత్ సినిమా నిర్మాణ షెడ్యూల్స్ పై ప్రభావం పడుతుందా? మరీ ముఖ్యంగా, ఇది సంబంధిత వ్యక్తుల కెరీర్లు మరియు ప్రతిష్ఠల పై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది? అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి