శర్వానంద్ కు ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో చక్కని ప్రశంసలతో పాటు బాక్స్ ఆఫీసు వద్ద హిట్ ఇచ్చారు దర్శకుడు శ్రీ కార్తిక్. ఈ సినిమాకి వచ్చిన టాక్ కు కాస్త తక్కువ కలెక్షన్లు వస్తున్నాయి అనే మాట అటుంచితే.. ఒక మంచి సినిమాగా దాదాపు సినిమా చూసిన వారందరి చేతా ప్రశంసింపబడింది. అమ్మ సెంటిమెంట్ కు సైన్స్ ఫిక్షన్ యాంగిల్ ను జత చేసి ఎక్కడా అనవసరమైన హంగూ ఆర్భాటాలకి పోకుండా ఒక హృద్యమైన అనుభవంలా తీర్చిదిద్దినందుకు దర్శకుడు శ్రీ కార్తిక్ కి మంచి మార్పులు పడ్డాయి.
ఐతే తనకి తన సినిమాకి వస్తున్న ఆదరణకు శ్రీ కార్తిక్ ఖచ్చితంగా అర్హులే. ఎందుకంటే ఇదేదో అషామాషిగా తెరకెక్కిన సినిమా కాదు. ఈ కథని రాయడానికే కార్తిక్ కి రెండేళ్ళు పట్టింది. ఇక కథకు తగ్గ హీరో కుదరడానికి మరో ఏడాదిన్నర పట్టింది. తర్వాత కోవిడ్ వలన అదనంగా రెండేళ్ళ జాప్యం.. ఇలా అన్ని అవాంతరాలు దాటుకుని సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి దాదాపు ఐదేళ్ళు పట్టింది. అయితే ఇన్ని కష్టాలు మరియు ఇన్ని రోజుల నిరీక్షణకు తెరపడిన తర్వాత దర్శకుడు శ్రీ కార్తిక్ కు తగిన ఫలితం దక్కిందనే చెప్పాలి. ప్రేక్షకులకు సినిమా చాలా బాగా కనెక్ట్ అయ్యింది. సినిమాలోని పాత్రలతో మమేకం అయిపోయి, వాటి తాలూకు భావోద్వేగాలను కూడా తమవే అనుకునే స్థాయిలో సినిమా వాళ్లకు నచ్చింది.
అయితే ఇప్పుడు శ్రీకార్తిక్ గురి ఒక పెద్ద సినిమా మీదకు వెళ్ళింది. తన రెండో సినిమాని అల్లు అర్జున్ తో చేయాలని ప్లాన్ చేస్తున్నారు కార్తిక్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. నా కొత్త సినిమా తెలుగులో ఉండబోతుంది. పెద్ద స్కేల్ లో థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా చేయాలనే ఆలోచన వుంది. ఒక ఫాంటసీ స్క్రిప్ట్ వుంది. రియలిజం ఫాంటసీ కాన్సెప్ట్ తో ఆ సినిమా చాలా క్రేజీగా వుంటుంది. నా రెండో సినిమా అల్లు అర్జున్ గారితో చేయాలని వుంది. ఆయనకి వెళ్లి కథ చెప్పాలి. చెన్నైలో తెలుగు సినిమా అంటే అల్లు అర్జున్ సినిమానే. మా ఫ్యామిలీలో అంతా అల్లు అర్జున్ అభిమానులమే. ఆయనతో సినిమా కోసం ఐదేళ్ళు వెయిట్ చేయడానికి కూడా ఓకే అని చెప్పుకొచ్చారు దర్శకుడు శ్రీకార్తిక్.
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా చిత్రీకరణ పూర్తయ్యే వరకు ఎంత లేదన్నా మరో రెండేళ్లు పడుతుంది. మరి దర్శకుడు శ్రీ కార్తిక్.. అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి నిజంగానే ఐదేళ్లు ఎదురు చూడాల్సి వస్తుందో లేక ఈలోపే ఆయనకు అల్లు అర్జున్ నుంచి పిలుపు వస్తుందో చూడాలి.