తెలుగు సినిమా పరిశ్రమలో టైర్-2 రేంజ్ హీరోల్లో శర్వానంద్ కి మంచి క్రేజ్ ఉంది. సహజమైన నటనతో పాత్రలకు న్యాయం చేయడంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. ఆలాగే ఒకప్పుడు రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు ఇలా ఆయన నటించిన సినిమాలన్నీ మినిమం గ్యారెంటీ హిట్స్ గా నిలిచాయి. అయితే ఈ మధ్యకాలంలో శర్వానంద్ కి సరైన విజయం దక్కలేదు. దిల్ రాజు నిర్మాణంలో, దర్శకుడు సతీష్ వేగేశ్న రూపొందించిన ‘శతమానం భవతి’ సినిమానే శర్వాకి చివరి సూపర్ హిట్ చిత్రం. ఆ తరువాత వచ్చిన ‘పడి పడి లేచే మనసు’, ‘శ్రీకారం’, ‘జాను’, ‘రణరంగం’, ‘మహాసముద్రం’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఇలా వరుసగా ప్లాప్ సినిమాల వల్ల శర్వానంద్ మార్కెట్ దిగువ స్థాయికి వచ్చేలా పరిస్థితి ఏర్పడింది.
అయితే వరుస పరాజయాల తర్వాత ఎట్టకేలకు శర్వానంద్ కు సంతోషాన్ని ఆయన తాజాగా నటించిన ‘ఒకే ఒక జీవితం’ సినిమా ఇచ్చింది. ఈ చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజు చాలా సాధారణ ఆక్యుపెన్సీలను నమోదు చేసినా, క్రమంగా పాజిటివ్ టాక్ పెరగడం వలన బాక్స్ ఆఫీస్ వద్ద పుంజుకుంది.
శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించిన ఒకే ఒక జీవితం సినిమాలో అమల, వెన్నెల కిషోర్, రీతూ వర్మ మరియు ప్రియదర్శి కూడా కీలక పాత్రల్లో నటించారు.
కాగా ఈ సినిమా అన్ని చోట్లా ప్రశంసలు అందుకుంటున్న వేళ, శర్వానంద్ ఒక షాకింగ్ న్యూస్ ను తెలియజేశారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రక్రియలో తనకు చాలా కష్టంగా అనిపించింది అని ఆయన చెప్పారు. ”ఈ సినిమా కారణంగా నేను డిప్రెషన్‌లోకి వెళ్ళాను. నేను నా షెడ్యూల్‌ను ఆపేసి కౌన్సెలింగ్ కోసం యుఎస్ వెళ్ళవలసి వచ్చింది, ”అని శర్వానంద్ తెలిపారు.
ఈ చిత్రం తనపై బలమైన ప్రభావాన్ని చూపిందని, అంతే కాక తను సంప్రదించిన డాక్టర్ కూడా ఇలాంటి సినిమాలు చేయవద్దని సూచించాడని శర్వానంద్ తెలిపారు. శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి రచనతో పాటు దర్శకత్వం కూడా వహించారు. అలాగే వర్ధమాన నటుడు, దర్శకుడు అయిన తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి డైలాగ్స్ రాశారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.