తెలంగాణలోని గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కిన దసరా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నారు నాచురల్ స్టార్ నాని. సినిమా విజయం పై చాలా కాన్ఫిడెంట్ గా కనిపించిన ఆయన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఇదే విషయాన్ని పలుమార్లు పునరుద్ఘాటించారు.
నిజానికి అధికారికంగా ఈ సినిమాని ప్రకటించిన రోజు నుండి, దసరా తన ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్ తో చాలా ప్రశంసలు మరియు ఆసక్తిని పొందింది. టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన రాగా, పాటలు కూడా వైరల్ గా మారి ఆడియో ప్లాట్ ఫామ్స్ లో టాప్ పొజిషన్ లో నిలిచాయి.
ఇటీవలే ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో నాని ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ మరపురాని సంఘటనను బయటపెట్టారు. “డంపర్ ట్రక్ కోల్స్ ను తీసుకుని వెళ్లి డంప్ చేస్తుంటుంది. ఆ డంపర్ ట్రక్ లో నుంచి నేను కిందపడితే ఆ బొగ్గు నాపై పడాలి. సింథటిక్ బొగ్గు రెడీ చేశారు .. డస్ట్ తోనే అవి ఉంటాయి. ఆ డంపర్ లో నుంచి నేను క్రింద పడిపోయాను. సింథటిక్ కోల్స్ క్రింద నుంచి నన్ను పైకి లాగడానికి కొంత సమయం పడుతుంది. ఆ గ్యాప్ లో నేను గాలి పీల్చకుండా ఉండలేను .. పీల్చితే డస్ట్ అంతా లోపలికి వెళ్లిపోతుంది.
ఈ సీన్ షూటింగ్ అయ్యాక చాలా రోజుల పాటు.. డంప్ లో నుంచి బొగ్గుతో పాటు నేను పడటం .. బొగ్గు నాపై పడటం .. నన్ను పైకి లాగడం .. ఇవన్నీ నాకు పదే పదే గుర్తుకొచ్చేవి. లోపల ఏదో ఇబ్బందిగా అనిపించేది. అది క్లియర్ కావడానికి చాలా సమయం పట్టింది. ఆ కారణం వలన రెండు నెలల పాటు నిద్రపట్టలేదు” అని నాని చెప్పారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, సత్యన్ సూర్యన్ ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటర్ గా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్ గా, విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత.
నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్, సాయి కుమార్, రాజశేఖర్ అనింగి తదితరులు నటించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ , మలయాళ భాషల్లో మార్చి 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తెలంగాణలోని రామగుండం గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.