నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ‘కార్తికేయ 2’ ఇటీవలే థియటర్లలోకి వచ్చి విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్స్ ఆఫీసు వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇటు తెలుగు రాష్ట్రాలుతో పాటు హిందీలోనూ కార్తీకేయ 2 సినిమా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన అన్ని చోట్లా విశేష స్థాయిలో ఆదరణ పొందుతోంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ ల ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడైన చందూ మొండేటికి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ క్షమాపణలు చెప్పింది. అయితే అనుపమ అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. కార్తీకేయ 2 సినిమాకి సంబందించి గుజరాత్ లో షూటింగ్ జరుగుతుండగా అనుపమకు గాయాల కారణంగా వెన్నునొప్పి వచ్చిందట. కష్టం అయినప్పటికీ ఆ షెడ్యూల్ పూర్తి చేశారట. ఇక మరో రోజు సాంకేతిక సమస్యల కారణంగా కూడా షూటింగ్ ఆలస్యం కావడంతో అనుపమ చాలా ఫ్రస్ట్రేషన్ కు గురై అనవసరంగా చందూ మొండేటి లాంటి దర్శకుడితో పని చేశానని అనుపమ బాధ పడ్డారట.
అయితే ఆరోజు అలా అనకుండా ఉండాల్సిందని అనుపమ చాలా బాధ పడ్డారు. ఆ రోజు అలా మాట్లాడినందుకు వేదిక పై దర్శకుడికి క్షమాపణ చెప్పారు. తర్వాత ఇంత మంచి సినిమా మరియు పాత్ర ఇచ్చినందుకు హీరో నిఖిల్ కు దర్శకుడు చందూ మొండేటికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఇంతటి ఘన విజయాన్ని నిఖిల్ తో పాటు తానూ ఊహించనేలేదని అన్నారు.
ద్వారక – శ్రీకృష్ణుని మహత్మ్యం నేపథ్యంలో రూపొందిన ఈ అడ్వెంచర్ చిత్రాన్ని చందూ తెరకెక్కించిన విధానానికి ఎన్నో గొప్ప ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ- అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. కాల భైరవ సంగీతం అందించారు. దిల్ రాజు- అల్లు అరవింద్ – బెక్కెం వేణుగోపాల్ తదితరులు ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్తీకేయ 2 ఘన విజయం సాధించడంతో కార్తికేయ 3 కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరి కార్తికేయ మూడో భాగంలో కూడా అనుపమ హీరోయిన్ గా నటిస్తారో లేదో ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. ఇదిలా ఉండగా . నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా ’18 పేజీస్’ అనే సినిమాలో కూడా అనుపమ పరమేశ్వరన్ కలిసి నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా తొందరలోనే విడుదల కానుంది.