ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రమైన ఆదిపురుష్ జూన్ 16న విడుదలకు ముందే ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శిస్తామని ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఈ సినిమా ప్రదర్శనకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మొదట ఈ చిత్రాన్ని 13న మాత్రమే ప్రదర్శించాలని నిర్వాహకులు భావించినా సినిమా చుట్టూ నెలకొన్న క్రేజ్ కారణంగా తమ ప్లాన్స్ మార్చుకున్నారు.
‘ఆదిపురుష్’ చిత్రాన్ని జూన్ 13, 14, 15 తేదీల్లో ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా ప్రదర్శించనున్నట్లు, ట్విట్టర్లో అధికారికంగా వార్తలు వచ్చిన వెంటనే ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు ఈ వార్తను సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యేలా షేర్ చేస్తూ సూపర్ స్టార్ గా ప్రభాస్ స్టామినాకు ఇది నిదర్శనమని ఆనందంగా తెలుపుతున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. అలాంటి దేవుడి పాత్రను చేయడానికి ప్రభాస్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని దర్శకుడు ఓం రౌత్ పలుమార్లు చెప్పారు. ఇక సీతగా కృతి సనన్, హనుమంతుడిగా దేవా దత్త నాగే, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించనున్నారు. ఇందులో ప్రతినాయకుడు లంకేశ్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు.
ఆదిపురుష్ జూన్ 16న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. టి-సిరీస్ ఫిల్మ్స్, రెట్రోఫిల్స్ ప్రొడక్షన్స్ పతాకాల పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.