తమిళ హీరో కార్తీ నటించిన విరుమాన్ సినిమా ఆగస్ట్ 12న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన స్పందనను తెచ్చుకుంది. సమీక్షల పరంగా కాస్త మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తన హవాను కొనసాగించగలిగింది, తొలి మూడు రోజులకు 30 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే సినిమాకి ఖచ్ఛితగా హిట్ టాక్ అవసరం, కానీ కార్తీ విరుమాన్ సినిమా ప్రతికూల నేపథ్యంలో కూడా విజయం సాధించడం విశేషం.
పల్లెటూరి కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి ఇండస్ట్రీ వర్గాల నుంచి విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఎం ముత్తయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళనాడులో కలెక్షన్ల సునామీ సృష్టించింది. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్య ఈ చిత్రాన్ని నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం, ఎస్ కె సెల్వకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.
ఈ సినిమా ఘనవిజయం సాధించినందుకు సంబరాలు చేసుకుంటున్న డిస్ట్రిబ్యూటర్లు.. విరుమాన్ చిత్ర బృందానికి కృతజ్ఞతగా కానుకలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్‌కి ఖరీదైన బహుమతులు ఇచ్చి సత్కరించాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ శక్తివేలన్ సూర్య మరియు కార్తీతో పాటు 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ CEO మరియు విరుమాన్ సహ నిర్మాత రాజశేఖర్ పాండ్యన్‌లకు డైమండ్ బ్రాస్‌లెట్లను బహుమతిగా ఇవ్వడం విశేషం. శక్తివేలన్ దర్శకుడు ముత్తయ్యకు కూడా డైమండ్ రింగ్ కూడా బహుమతిగా ఇచ్చారు.
హీరో కార్తీ ఇది వరకు గ్రామీణ ప్రాంత నేపథ్యంలో రూపొందిన కడై కుట్టి సింగం (తెలుగులో చిన్నబాబు) లో నటించగా ఆ చిత్రం కూడా ఘన విజయం సాధించింది. తమిళనాట మాత్రమే కాకుండా తెలుగులోనూ తన అన్న సూర్య లాగా కార్తీకి మంచి ఇమేజ్ మరియు మార్కెట్ ఉంది. అయితే ఆగస్ట్ పదిహేను వారాంతంలో ఇక్కడ తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాలు కూడా విడుదల కావడంతో విరుమాన్ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయలేదు. ఏదేమైనా కార్తీ లాంటి మంచి నటుడు మరో విజయవంతమైన సినిమాలో భాగం కావడం అందరికీ ఆనందమే.