ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న రానా నాయుడు అనే వెబ్ సిరీస్ కోసం విక్టరీ వెంకటేష్, ఆయన వరసకి కొడుకు అయిన రానా దగ్గుబాటి తొలిసారి కలిసి పని చేశారు. అయితే ఈ వెబ్ సిరీస్ విడుదలైనప్పటి నుంచి అందులోని అడల్ట్ కంటెంట్ పై విమర్శలు రావడంతో పాటు వెంకటేష్ అభిమానులు మరియు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆయన రానా నాయుడు లాంటి షో చేయడం పై విమర్శలు గుప్పించారు. కాగా ఈ వెబ్ సిరీస్ పై వస్తున్న విమర్శలపై హీరో రానా స్పందించారు.
రానా నాయుడులోని అసభ్యకరమైన సన్నివేశాలు, అసభ్య పదజాలం ఉన్న డైలాగులను కొందరు నెటిజన్లు ఒప్పుకోకపోగా, ఓటీటీలో అలాంటి కంటెంట్ తమకు సాధారణంగా ఆమోదయోగ్యం కావడంతో మరికొందరు పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇక ఈ సిరీస్ కు మద్దతుగా అభిప్రాయం వ్యక్తం చేసిన నెటిజన్లతో రానా ఏకీభవించారు.
ఇక రానా నాయుడు విషయానికొస్తే బూతు డైలాగులు మరియు సెక్సువల్ కంటెంట్ అనేవి పక్కన పెడితే ఇది ఓటీటీ ప్రపంచంలో వచ్చే రెగ్యులర్ వెబ్ సిరీస్ అని చెప్పవచ్చు. కాగా ఇందులో ఫ్యామిలీ సెంటిమెంట్, పొలిటికల్/సినిమా వరల్డ్ లింకులతో కూడిన క్రైమ్ ఎలిమెంట్స్ అన్నీ మనం ఇప్పటికే చూశామనే ఫీలింగ్ కలిగిస్తాయి.
వెంకటేష్, రానా డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడంతో షో కాస్త ఓకే అనిపించుకుంటుంది. అలాగే వెబ్ సిరీస్ నిడివి కూడా ఒక సమస్యే. 5 ఎపిసోడ్స్ లో కంప్లీట్ చేసి ఉండాల్సింది కానీ 10 ఎపిసోడ్స్ కి ఈడ్చుకెళ్లారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నిర్మాణ విలువలు వంటి ఇతర విభాగాలు ఈ క్రైమ్/ ఫ్యామిలీ డ్రామాలో వెంకటేష్, రానాల ప్రశంసనీయమైన నటనతో పాటు బాగుండి ఆకట్టుకున్నాయి. కాగా రానా నాయుడు వెబ్ సిరీస్ కు కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ దర్శకత్వం వహించారు.