నటుడు మరియు జనసేన పార్టీ ముఖ్య సభ్యుడు నాగబాబు ఇటీవలే ముఖ్య అతిథిగా హాజరై ‘ది రియల్ యోగి’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఆర్థికంగా బలంగా లేరని.. తాను రాజకీయ పార్టీని ప్రారంభించినప్పుడు తన పిల్లల భవిష్యత్తు కోసం దాచిన డబ్బును బ్యాంకు నుండి తీసి ఖర్చు చేసి మరీ పవన్ పార్టీ స్థాపించారని నాగబాబు తెలిపారు.
పవన్ కళ్యాణ్ అత్యంత క్రేజీ హీరో అయినప్పటికీ ఆర్థికంగా తన పరిస్థితీ ఏమీ బలంగా లేదని నాగబాబు పేర్కొన్నారు. కానీ ఒక వ్యక్తిగా చూస్తే మటుకు పవన్ కళ్యాణ్ ఇతరులతో పోల్చితే అందనంత ఎత్తులో ఉంటారని నాగబాబు పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన పవన్ కళ్యాణ్ అభిమాని గణ రచించిన ‘ది రియల్ యోగి’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తన సోదరుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లాగా ఉండగలనా అని కొన్ని వందల సార్లు అనుకున్నానని నాగబాబు అన్నారు.
చిన్నప్పటి నుంచి పవన్ ఒంటరి వ్యక్తి అని ఆయన అన్నారు. అప్పుడప్పుడు ఏడుస్తూ ఉండేవాడని తెలిపారు. కానీ, 10వ తరగతి తర్వాత పవన్ గురించి అందరూ కాస్త అర్థం చేసుకున్నారని నాగబాబు అన్నారు.
పవన్ ఆలోచనా విధానం పూర్తిగా ప్రత్యేకం. చిరంజీవి తమ్ముడు కాబట్టి అతనికి సినిమాలు ఇవ్వాలనే రూలేం లేదు. పవన్ అన్ని సినిమాలను అంగీకరించరని, నాణ్యమైన సినిమాలే చేస్తారని కూడా నాగబాబు అన్నారు.
పవన్ కళ్యాణ్ కు టీడీపీ లేదా బీజేపీ ఇలా ఏ పార్టీలో చేరి ఉన్నా మంత్రి పదవి వచ్చి ఉండేదని ఆయన పేర్కొన్నారు. అయితే పదవుల కోసం కాకుండా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పార్టీని ప్రారంభించారని నాగబాబు అన్నారు. అవినీతిపరులను అడ్డుకునేందుకే పవన్ పార్టీ పెట్టారని నాగబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి అని నాగబాబు వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా మారితే కోట్లాది మందికి సాయం చేయగలడని భావించానని నాగబాబు అన్నారు. పవన్ తమ ఇంట్లోనే పుట్టాడని, అందుకే ఆయన గురించి ఎక్కువగా చెప్పలేనని అన్నారు.
ఈ కార్యక్రమంలో దర్శకులు మెహర్ రమేష్, బాబీ కొల్లి, తనికెళ్ల భరణి, రచయిత గణ, శ్రీకాంత్ రిషా, సాహి సురేశ్ శైల తాళ్లూరి తదితరులు పాల్గొన్నారు.