SSMB29 అనేది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత క్రేజ్ కలిగిన చిత్రాలలో ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి తండ్రి మరియు ప్రముఖ రచయిత కె.వి.విజయేంద్ర ప్రసాద్ నిజజీవితంలో జరిగిన ఓ సంఘటన ఈ చిత్రానికి స్ఫూర్తి అని గతంలో ధృవీకరించారు. అవును, ఇదొక అడ్వెంచర్ స్టోరీ అని వచ్చే ఏడాది విడుదల కానుందని ఆయన చెప్పారు.
ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా గురించి ఇప్పుడు మరో ఆసక్తికరమైన అప్‌డేట్ తెలిసింది. అదేంటంటే రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో రానున్న ఈ భారీ సినిమాను ఒక ఫ్రాంచైజీగా డెవలప్ చేస్తున్నట్లు వినికిడి.
కాగా ప్రస్తుతం మొదటి భాగం స్క్రిప్ట్‌ని ఫైనల్ చేసే పనిలో ఉన్నామని రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ చిత్రానికి సీక్వెల్స్ ఉంటాయా అని కెవి విజయేంద్ర ప్రసాద్‌ను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు, “అఫ్ కోర్స్. సీక్వెల్స్ వస్తాయి” అని ఆయన తెలిపారు. కాగా ఈ సీక్వెల్స్‌లో కథ మారుతుందని, అయితే ప్రధాన పాత్రలు మాత్రం అలాగే ఉంటాయని ఆయన అన్నారు.
ఇక ఈ చిత్రంలో మునుపటి రాజమౌళి చిత్రాల కంటే మరింత ప్రభావవంతంగా ఉండే హార్డ్ కోర్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని అంతర్గత వర్గాలు వెల్లడించాయి.
ఇంతకుముందు, ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ ని ఎంపిక చేయడం గురించి మాట్లాడుతూ, మహేష్ బాబు చాలా తీవ్రమైన నటుడు అని ప్రసాద్ పేర్కొన్నారు. “మీరు అతని యాక్షన్ సన్నివేశాలను చూస్తుంటే, అతను చాలా ఇంటెన్స్‌గా ఉంటారు మరియు ఏ రచయితకైనా అది మంచి విషయమే” అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.
రాజమౌళి చాలా కాలంగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ సినిమా చేయాలని అనుకుంటున్నారని, కానీ ఆ సినిమా చేసే అవకాశం తనకు రాలేదని విజయేంద్ర ప్రసాద్ మళ్లీ అన్నారు. అయితే ఆయన ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ కి మహేష్ బాబు అయితేనే ఉత్తమ ఎంపిక అని రాజమౌళి భావించారట. మరియు అప్పటి నుంచే వారిరువురూ ఈ చిత్రం కోసం రాయడం ప్రారంభించారట.
ఎస్ఎస్ రాజమౌళితో కలిసి పనిచేయడానికి మహేష్ కూడా తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని, ఇది తనకు కల లాంటి నిజమని చెప్పారు. రాజమౌళితో ఒక్క సినిమా చేయడం అంటే ఒకేసారి 25 సినిమాలు తీయడం లాంటిదని ఆయన అన్నారు.
అదే సమయంలో, జనవరి 2023 నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే తన 28వ సినిమా (SSMB28) షూటింగ్‌ను మహేష్ తిరిగి ప్రారంభించనున్నారు. మహేష్ బాబుతో పాటు, ఈ చిత్రంలో పూజా హెగ్డే కూడా ప్రధాన పాత్రలో నటించారు మరియు థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.