కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫిబ్రవరి 18న విడుదల కానుండగా, ప్రస్తుతం తెలుగు సినీ అంతర్గత వర్గాల ద్వారా ఈ సినిమాకి వినిపిస్తున్న టాక్ చూసి నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారట. నిజానికి ఈ సినిమా కూడా ఫిబ్రవరి 17నే విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది.
కిరణ్ అబ్బవరం, కష్మిరా పరదేశి జంటగా నటించిన ఈ సినిమాని ఒక రోజు ఆలస్యంగా అంటే ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. అందుకు కారణం గీతా ఆర్ట్స్ బ్యానర్ కి ఉన్న శనివారం సెంటిమెంట్ అని తెలుస్తోంది. సినీ పరిశ్రమలో ఇలాంటి సెంటిమెంట్లు సహజమే.
ఇక ఇండస్ట్రీకి సంభందించిన కొందరు ఈ సినిమాను చూసి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారని సమాచారం అందుతోంది. నిర్మాత అల్లు అరవింద్ కూడా సినిమా అవుట్ పుట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారట. గత కొంతకాలంగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన సినిమాలు పెద్ద విజయాలు సాధించలేదు కాబట్టి ఈ సినిమాతో ఒక భారీ విజయాన్ని అందుకోవాలని వారు ఆశిస్తున్నారు.
వినరో భాగ్యము విష్ణు కథ సినిమా నుండి ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ మరియు ఫస్ట్, సెకండ్ సింగిల్స్ అయిన ‘వాసవ సుహాస’, ‘ఓ బంగారం’ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.జీఏ2 పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మురళీ శర్మ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. డానియల్ విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
వినరో భాగ్యము విష్ణు కథ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న పాజిటివ్ టాక్/రిపోర్ట్ నిజం అయి వినరో భాగ్యము విష్ణు కథ సినిమా భారీ విజయం సాధించాలని కోరుకుందాం.