కన్నడ బ్లాక్‌బస్టర్ కాంతార చిత్రం సోమవారం తన అద్భుతమైన ప్రదర్శనతో మరో రికార్డును జోడించింది. సోమవారం నాటి కలెక్షన్లతో, ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల మార్క్‌ను దాటింది. కాగా ఇప్పటికీ అన్ని భాషలలో హౌస్‌ఫుల్ షోలను నమోదు చేస్తూ తన జోరును కొనసాగిస్తూ అడ్డే లేకుండా దూసుకుపోతుంది.
తెలుగు వెర్షన్లో కాంతార ఇప్పటివరకు 30 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. పండగకి విడుదలైన కొత్త సినిమాల కంటే కూడా కాంతార సినిమా చూడటానికే ప్రేక్షకులు ఇష్టపడతున్నారు. మరియు హిందీ వెర్షన్లో సోమవారం నాటికి దాదాపు 27 కోట్లు వసూలు చేసింది.
ఇక తమిళం, మలయాళం వెర్షన్లు కలిపి దాదాపు 7 కోట్లు వసూలు చేసింది. మొత్తం మీద ఇతర వెర్షన్ల గ్రాస్ కలుపుకుంటే 65 కోట్లు వసూలు చేసింది. మరియు కర్ణాటక నుండి, ఈ చిన్న-బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ 115 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ వసూలు చేయడం విశేషం.
ఓవర్సీస్ మార్కెట్లో కూడా కాంతార ఎన్నో అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. అన్నీ కలుపుకుని మొత్తంగా ఈ చిత్రం సోమవారం నాటికి 200 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది ఎవరూ ఊహించని ఘన విజయం అనే చెప్పాలి.
ఇక ప్రస్తుతం కాంతార సినిమా కలెక్షన్ల ట్రెండ్స్‌ను పరిశీలిస్తే, రాబోయే రోజుల్లో తన నిలకడ కలిగిన ప్రదర్శనతో ఈ చిత్రం ఖచ్చితంగా 250 కోట్ల వసూళ్లు చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. కాగా మరికొన్ని రోజులు ఇదే జోరు కొనసాగితే 300 కోట్ల బిజినెస్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
కన్నడలో పాపులర్ నటుడు మరియు దర్శకుడు అయిన రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిన్న చిత్రం అసాధారణమైన సమీక్షలను మరియు బాక్సాఫీస్ రికార్డులను ఒకేసారి పొందడం ద్వారా ముందుగానే చెప్పుకున్నట్లు ఊహించలేని ప్రదర్శనను కనబర్చింది. అటు అద్భుతమైన స్పందనతో పాటు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సాధించటం అనేది చాలా తక్కువ సినిమాలు చేసి చూపించాయి.
ఈ చిత్రంలో కంబాల ఛాంపియన్‌గా రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించారు, కిషోర్, అచ్యుత్ కుమార్ మరియు సప్తమి గౌడ ఇతర సహాయక పాత్రల్లో నటించారు.