హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై నిర్మాత సి. అశ్వనీదత్ నిర్మించారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటు ఫిక్షనల్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం టీజర్ ట్రైలర్ లతో మంచి స్పందనను సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. రష్మిక మందన్న కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో ఇతర పాత్రల్లో సుమంత్, తరుణ్ భాస్కర్, గౌతమ్ మీనన్ నటించారు.
ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలలో హీరో దుల్కర్ సల్మాన్ పాల్గొన్నారు. ఆ క్రమంలోనే మాట్లాడుతూ తనకి ప్యాన్ ఇండియా అన్న పదం అంటే అసలు నచ్చదు అని చెప్పారు. పాన్ ఇండియా అనే ట్యాగ్ విని విని విసుగొచ్చింది. ఈ మధ్య ఆ పదం వాడకుండా ఒక ఆర్టికల్ కూడా ఉండటం లేదు. నిజానికి పాన్ ఇండియా అనేది ఏమీ ఇవాళ కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ కాదు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్.. ఇలా ఎంతో మంది స్టార్ల సినిమాలు దేశ విదేశాలు దాటి ఆదరణ పొందాయి. ఇప్పుడు ప్రత్యేకంగా పాన్ ఇండియా సినిమా అని ప్రత్యేకించి చెప్పడం అవసరం లేదని నా అభిప్రాయం అని దుల్కర్ అన్నారు. ఒక సినిమాను సినిమాగానే చెబితే చాలు అని ఆయన అన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ నటించిన సీతారామం ఆగస్టు 5వ తేదీన రిలీజ్ అవుతుంది.
ఈ క్రమంలో దుల్కర్ సల్మాన్ సినిమా గురించి మాట్లాడుతూ.. సీతారామం సినిమా విడుదల అయ్యాక ఈ సినిమా పై అందరి అభిప్రాయాలు మారిపోతాయి. ఈ సినిమా కథ గురించి రకరకాలుగా ప్రేక్షకులు ఊహించుకొంటున్నారు. రష్మిక నా కూతురు అని కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు. ఎవరు ఎలా ఊహించుకున్నా.. అందరి ఊహలకు భిన్నంగా సినిమా ఉంటుంది అన్నారు. ఈ సినిమా ట్రైలర్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు నాపై చూపించిన ప్రేమ గురించి మాటల్లో చెప్పలేను అని దుల్కర్ సల్మాన్ అన్నారు. విజయవాడ, వైజాగ్‌లో పొందిన అనుభూతి ఓ వరం లాంటింది. సాధారణంగా కొచ్చిలో ఇలాంటి స్పందన ఉంటుంది. కానీ వైజాగ్ టూర్ మాత్రం నాకొక అద్భుతమైన అనుభూతిగా ఉంది అని దుల్కర్ సల్మాన్ చెప్పారు.
ఆయన చెప్పింది నిజమే మరి.. మళయాళ హీరో అయినా దుల్కర్ సల్మాన్ తెలుగులోనూ చక్కని పేరు సంపాదించుకున్నారు. మహానటి చిత్రంలో జెమినీ గణేషన్ పాత్రలో ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులు మంత్ర ముగ్ధులు అయ్యారు. ఆ తరువాత ఆయన డబ్బింగ్ సినిమాలు కనులు కనులను దోచాయంటే, కురూప్ సినిమాలు ఇక్కడ విజయం సాధించాయి. మరి సీతారామం చిత్రం కూడా అదే కోవలో చక్కని సినిమాగా నిలిచి ప్రేక్షకుల ఆదరణను పొందుతుంది అని ఆశిద్దాం.