హీరోగా విజయ్ దేవరకొండ పాపులారిటీ రోజురోజుకూ పెరిగిపోతోంది. అర్జున్ రెడ్డి చిత్రంతో వెలుగులోకి వచ్చిన విజయ్, పరిశ్రమలోకి వచ్చి దాదాపు దశాబ్దం కాలం నుండి ఉన్నారు, అయితే ఎట్టకేలకు 2017 లో బ్రేక్ సాధించిన విజయ్ ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల లోనే కాకుండా ఇతర పరిశ్రమలో కూడా క్రేజ్ ను సంపాదించుకుని ప్యాన్-ఇండియా ఫాలోయింగ్‌ను సాధించారు, అంతే కాకుండా పలు ప్రఖ్యాత జాతీయ టీవీ షోలు మరియు ప్రకటనలలో కనిపించారు.
ఒక స్టార్ గా ఆయన బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు చాలా మంచి స్థాయిలో ఉండడంతో, చాలా మంది విజయ్ దేవరకొండను టాలీవుడ్‌లోని సూపర్ స్టార్‌లలో ఒకరిగా లెక్కించడం ప్రారంభించారు. అయితే, ఆ స్థానం దక్కాలంటే తను చాలా దూరం ముందుకు వెళ్లాల్సి ఉందని, ఇంకా స్టార్ అని పిలిపించుకునే అర్హత తనకు లేదని ఎంతో వినయంగా నిరాకరించారు విజయ్.
నిన్న వరంగల్‌లో జరిగిన లైగర్ ఫ్యాండమ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ తనను సూపర్ స్టార్ అని పిలవవద్దని అభిమానులు మరియు మీడియాతో ప్రస్తావించారు, ఈ సందర్భంలో.. “నేను సూపర్ స్టార్‌ని కాదు, నన్ను అలా పిలవద్దు.. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ స్థానంలో రావడానికి తగిన పనులు నేను ఇంకా చేయలేదు.. చేయాలి. ,” అని విజయ్ వివరించారు.
ఇక ఇదే క్రమంలో క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, పూరి తన కెరీర్‌కు గొప్ప మార్గదర్శక శక్తి అని చెప్పారు. అలాగే పూరి డైలాగులు పలకాలంటే ఏ నటుడికైనా అదృష్టంతో పాటు దేవుడి ఆశీస్సులు ఉండాలని, అవి తన పై ఉండడం వల్లే ఆ అవకాశం దక్కిందని చెప్పారు. ఇక పూరి మార్క్ మాస్ డైలాగ్‌లతో లైగర్ అలరిస్తుందని విజయ్ దేవరకొండ తెలిపారు. అనన్య పాండే మరియు రమ్యకృష్ణ కూడా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 25న విడుదల కానుంది.
2011 లో విడుదలైన నువ్విలా చిత్రంలో చిన్న పాత్రలో కనిపించి తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టారు విజయ్ దేవరకొండ. ఆ పై లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో కూడా ఒక సహాయక పాత్రలో నటించారు. 2015 లో నాని నటించిన ఎవడే సుబ్రమణ్యం సినిమాలో రిషిగా అద్భుతమైన నటనను ప్రదర్శించి అందరి దృష్టిలో పడ్డారు. ఆ పై పెళ్లి చూపులు వంటి సూపర్ హిట్, అర్జున్ రెడ్డి వంటి కెరీర్ దశాదిశలు మార్చేసే బ్లాక్ బస్టర్ కొట్టిన తరువాత విజయ్ కి వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా పోయింది.