టాలీవుడ్ లో చాలా మంది దర్శకులు ఉన్నారు కానీ రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ వంటి కొద్దిమంది దర్శకులు మాత్రమే తమకంటూ ఒక బ్రాండ్ మార్కెట్ ను క్రియేట్ చేసుకోగా, ఇతర దర్శకులు మాత్రం సక్సెస్ ఫుల్ సినిమాలు చేసినా సరైన ప్రభావం చూపించడంలో విఫలమవుతున్నారు.
మహర్షి సినిమాతో సూపర్ హిట్ ఇచ్చారు దర్శకుడు వంశీ పైడిపల్లి. కానీ అలాంటి సినిమా తర్వాత టైర్ 1 లిస్ట్ నుంచి ఏ హీరో కూడా ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదు. బోయపాటి శ్రీను, పరశురామ్, బాబీ, గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్ వంటి దర్శకుల విషయంలోనూ ఇదే చెప్పొచ్చు.
ఈ దర్శకులందరూ మంచి అవకాశాలను అందిపుచ్చుకున్నప్పటికీ కేవలం తమ వర్కింగ్ స్టయిల్ కారణంగానే తమదైన మార్క్ క్రియేట్ చేసుకోలేకపోయారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాను ఫాలో అవుతూ రొటీన్ తరహా కంటెంట్ తోనే వారు సినిమాలు తీస్తున్నారు.
ఇప్పటికే 10 సూపర్ హిట్ చిత్రాలను మిక్స్ చేసి ఒక సినిమా తీసే దర్శకుడిగా వంశీ పైడిపల్లి ప్రేక్షకుల్లో ముద్ర వేయించేసుకున్నారు. బోయపాటి శ్రీను విషయానికి వస్తె టాప్ యాక్షన్ సీక్వెన్స్ లను హ్యాండిల్ చేయడంలో మాత్రమే ఆయన సమర్థవంతంగా పని చేస్తారు.
ఇక ఎలివేషన్ డైలాగులు రాయడంలో హరీష్ శంకర్, పరశురామ్ బాగా పేరు తెచ్చుకోగా, కామెడీ సీన్స్ ని బాగా హ్యాండిల్ చేయగలరు, కానీ ఓవరాల్ గా సరైన సినిమా తీయడంలో వారికి పట్టు లేదనే పేరు వచ్చింది. అందుకే వారి సినిమాలు కొన్ని ఎపిసోడ్లకు మాత్రమే పాపులర్ అయ్యాయి.
ఈ సంక్రాంతికి దర్శకులు బాబీ, గోపీచంద్ మలినేని వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి కానీ డైరెక్షన్ ప్రకారం ఈ ఇద్దరు యంగ్ టెక్నీషియన్స్ సరైన ఫిల్మ్ మేకర్స్ గా కాకుండా హీరోలకి ఫ్యాన్ బాయ్స్ గా మాత్రమే రాణించారు.