పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ‘కేజీఎఫ్ 2’ను అర్థంపర్థం లేని సినిమా అంటూ దర్శకుడు వెంకటేష్ మహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెంకటేష్ మహా, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ, ఇంద్రగంటి మోహన కృష్ణ మరియు నందిని రెడ్డి కలిసి ఒక యూట్యూబ్ రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఆ ఇంటర్వ్యూలో వెంకటేష్ మహా కేజీఎఫ్ 2ను చాలా విచిత్రమైన చేష్టలతో విమర్శించడమే కాకుండా కించపరిచే విధంగా మాట్లాడారు. ఆయన మాట్లాడిన తీరు ఏమాత్రం బాగోలేదని, అలానే అనుచితంగా ప్రవర్తించారని నెటిజన్లు ఆయన పై మండిపడుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఘనవిజయం సాధించిన మరో దర్శకుడి సినిమా గురించి అలా తక్కువ చేసి మాట్లాడే హక్కు వెంకటేష్ కు ఏముందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసిన వెంకటేష్ మహా (రెండోది రీమేక్) ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 పై జోక్లు పేల్చడం దారుణమని సోషల్ మీడియా యూజర్లు అభిప్రాయపడుతున్నారు.
వెంకటేష్ మహా కేజీఎఫ్ 2 సినిమా కథ గురించి వ్యంగ్యంగా మాట్లాడుతూ కథానాయకుడిని తల్లి ధనవంతుడు కావాలని కోరుకుంటుందని, అందులు హీరో కేజీఎఫ్ లోని వ్యక్తులను ఉపయోగించుకుని హీరో డబ్బు సంపాదిస్తాడని, అందుకు ప్రతిఫలంగా వారికి ఏమీ ఇవ్వడని ఆయన కేజీఎఫ్ 2ను ఎగతాళి చేశారు.
అలాగే హీరో పాత్రను నీచ్ కమీన్ కుత్తే అనడం కూడా ఆయన పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తేలా చేసింది. ఒక దర్శకుడు అయి ఉండి ఇలా మాట్లాడడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని నెటిజన్లు అంటున్నారు. నిజానికి ఇంటర్వ్యులో వెంకటేష్ మహా మాట్లాడిన తీరు చూస్తే, ప్రశాంత్ నీల్ తో తనకు ఏదో వైరం ఉన్నట్టుగా ఆయన చాలా ఉద్వేగానికి లోనయ్యారు. కేజీఎఫ్ 2 విజయాన్ని తట్టుకోలేనట్లుగా సినిమాను విమర్శించి ఎంజాయ్ చేయడం మనం చూడవచ్చు.
అయితే ఈ ఇంటర్వ్యూ లోని చర్చ ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యంతో జరగలేదని, ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని దర్శకురాలు నందిని రెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు. ఏ సినిమా అయినా కమర్షియల్ గా విజయం సాధించింది అంటే అందులో ప్రేక్షకులను ఆకట్టుకునే ఏదో ఒక అంశం ఉండే ఉంటుంది అని ఆమె అన్నారు.