సూర్య 42వ సినిమా కంగువ టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో సూర్యతో పాటు కోలీవుడ్ అభిమానులందరి లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమా యొక్క అనౌన్స్ మెంట్ వీడియోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. నిజానిక దర్శకుడు శివ ఈ తరహా సినిమాని తెరకెక్కించే సత్తా ఉందా అని టీజర్ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారనే చెప్పాలి.
కమర్షియల్ ఎలిమెంట్స్, హీరో ఎలివేషన్స్ తో కూడిన సినిమాలను ట్రెడిషనల్ స్టైల్ లో ప్యాక్ చేయడంలో శివ దిట్టగా పేరు పొందారు. ఈ మధ్య కాలంలో ఎన్నో హిట్స్ ఇచ్చిన ఈ దర్శకుడు ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేసిన అన్నాత్తే (పెద్దన్న) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది.
ఈ పరాజయం తర్వాత సూర్యతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను భారీ బడ్జెట్ పీరియాడిక్ మూవీగా అనౌన్స్ చేసినప్పుడు నిజానికి ప్రేక్షకుల్లో ఆశించినంత ఉత్సాహం రాలేదు. ఇది శివ స్వతహాగా తీసే సినిమా కానందున ఈ ప్రకటన పై అందరిలోనూ అనుమానాలు వ్యక్తమయ్యాయి.
కానీ అప్పటి నుంచి ఈ సినిమాకు అంతా కలిసి వస్తూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి. ఇక నిన్న విడుదలైన టైటిల్ టీజర్ కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది దర్శకులు తమ సినిమాలకు ఇంత క్వాలిటీ వీఎఫ్ ఎక్స్ ను రాబట్టలేకపోయారు. మొత్తానికి కంగువ టైటిల్ టీజర్ మంచి వీఎఫ్ఎక్స్ వర్క్ చూపించగా అన్ని వైపుల నుంచీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.