టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా దిల్ రాజు కు మంచి పేరుంది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ మరియు ఎగ్జిబిటర్ గా ఆయన ఎదుగుదల ఎందరికో ఆదర్శంగా నిలిచింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పలు రంగాల్లో ఉండి విజయవంతంగా తన ప్రయాణాన్ని సాగిస్తూ వచ్చిన దిల్ రాజు ఇటీవలే పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. తెలుగు సినిమా నిర్మాతల గిల్డ్ తీసుకున్న నిర్ణయాలు వాటిని అమలు చేసిన తీరు కావచ్చు.. లేదా యువ హీరో నిఖిల్ నటించిన తాజా బ్లాక్ బస్టర్ హిట్ ‘కార్తికేయ 2’ రిలీజ్ విషయంలో ఆయన పై వచ్చిన కొన్ని పుకార్లు కావచ్చు.
ఇలా చాలా అనవసరమైన విషయాలలో సంబంధం ఉన్నా లేకున్నా ఆయనను చాలా మంది ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా నిందించారు. అయితే కార్తీకేయ-2 సినిమా సక్సెస్ మీట్ లో ఆయన ఈ పుకార్లన్నటికీ సమాధానం చెప్పారు అనుకోండి. ఇక ఇలాంటి చవకబారు విషయాలను పట్టించుకోకుండా ఆయన తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఆయన ప్రస్తుతం రెండు భారీ సినిమాలను నిర్మిస్తున్నారు.
RC-15 మరియు విజయ్ వరిసు రెండు సినిమాలు కూడా ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమాలు. ఆర్‌సి 15 చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ద్విభాషా చిత్రం వరిసు (తెలుగులో వారసుడు). ఈ రెండు సినిమాల మధ్య ఉండే కామన్ పాయింట్ ఏంటంటే ఈ రెండింటినీ నిర్మిస్తున్నది నిర్మాత దిల్ రాజు.
దిల్ రాజు బిజినెస్ పరంగా ఈ రెండు సినిమాలకు కలిపి ధరలను కోట్ చేస్తున్నారట. అందుకు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ ఒప్పందాల పై చాలా ఆసక్తి చూపుతున్నారనీ, అలాగే దిల్ రాజు చెప్పిన ధరను అందించడానికి సిద్ధంగా ఉన్నారనీ సమాచారం. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో, ఆర్‌సి 15 మరియు వరిసు కలిపి 65 కోట్ల రూపాయల భారీ ధరకు వ్యాపారం జరుపుకుంటున్నాయి. ఒక్కో సినిమాకీ విడివిడిగా చూసుకుంటే రెండు చిత్రాల హక్కులు 32 కోట్లు – 33 కోట్ల ధరలతో ఓకే స్థాయిలో ఉన్నాయి.
దిల్ రాజు అన్ని ప్రాంతాలలో కూడా ఇదే తరహాలో రెండు సినిమాలకు సంబంధించిన వ్యాపారం జరిగేలా చూసుకుంటున్నారు. అలాగే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ రెండు సినిమాలను అన్ని ప్రాంతాలలో అలానే కొనుగోలు చేసే అవకాశం ఉంది.
RC-15 ఒక సామాజిక సందేశంతో కూడిన రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటించనున్నారు. అవినీతి నిరోధక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శంకర్ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. మరోవైపు విజయ్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం వరిసు. ఈ రెండు చిత్రాలకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు.
వరిసు జనవరి 2023లో విడుదల కానుండగా, RC 15 వేసవిలో విడుదల అవుతుందని వార్తలు వినిపిస్తున్నా.. ఇంకా అధికారికంగా విడుదల తేదీని ఖరారు చేయలేదు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది.