ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ప్రస్తుతం సీతా రామం చిత్రం విజయం తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు. ఇండస్ట్రీ అంతా సినిమాలు మునుపటిలా ఆడతాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో సీతా రామం సినిమా ఘన విజయంతో ఆ చిత్ర నిర్మాత అయిన అశ్విని దత్‌తో పాటు సినీ పరిశ్రమకు కూడా ఊపిరి పోసింది అని చెప్పాలి.
ఇదిలా ఉండగా ఈటివిలో ప్రసారం అయ్యే హిట్ టాక్ షో అలీ తో సరదాగాలో అశ్విని దత్ పాల్గొన్నారు.ఈ మేరకు అలీతో జరిపిన మాటల సందర్భంగా, నిర్మాతల మండలి మరియు ఇతర సమస్యల గురించి అశ్విని దత్ మాట్లాడారు. ఒకానొక స్టార్ హీరోకి ఓ నిర్మాత 100 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశాడని అశ్విని దత్ చెప్పారు. కాగా అందులో యాభై శాతం అడ్వాన్స్‌గా ఇచ్చేసి, మిగిలిన మొత్తాన్ని షూటింగ్ తర్వాత చెల్లించాలని ఆ నిర్మాత ప్లాన్ చేసినట్లు చెప్పారు.
విచిత్రం ఏంటంటే అదే నిర్మాత నటీనటుల భారీ పారితోషికాల విషయంలో నిర్మాతల మండలి సమ్మెలో పాల్గొన్నారని అశ్విని దత్ పేర్కొన్నారు. ఆ నిర్మాత ఒక వైపు ఇలా హీరోలకు భారీ రెమ్యూనరేషన్లు ఇస్తూ, మరో పక్క నిర్మాతల మండలి సమ్మెలలో పాల్గొనడం ద్వారా ఏమి చెప్పాలనుకుంటున్నాడని, తద్వారా ఆ నిర్మాత ద్వంద్వ వైఖరిని అశ్విని దత్ బయట పెట్టారు.
అయితే ఈ విషయం చెప్తున్నప్పుడు అశ్విని దత్ ఎవరి పేర్లను తీసుకోనప్పటికీ, ఆయన మాట్లాడింది డివివి దానయ్య గురించే మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న మారుతీ, ప్రభాస్‌ల సినిమాకి సంబంధించి పారితోషికం విషయంలో పుకారు ఉంది. అయితే ఇప్పుడు ప్రభాస్-మారుతి సినిమా నుండి దానయ్య తప్పుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అదీ కాక పక్కా కమర్షియల్ భారీ పరాజయం పాలయిన దశలో అసలు ప్రభాస్ మారుతిల కాంబినేషన్లో అనుకున్న ప్రకారం సినిమానే ఉండకపోవచ్చని కూడా ఒక పుకారు కూడా ఉంది. మరి ఆ సినిమా ఉంటుందో లేదో ఈ వార్త నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.