చక్కని ప్రచార కార్యక్రమాలతో సూపర్ బజ్ క్రియేట్ చేసిన ధనుష్ తాజా చిత్రం సార్ (వాతి) తమ సినిమా కంటెంట్ పై ఉన్న నమ్మకంతో తెలుగు వెర్షన్ ప్రేక్షకులకు పెయిడ్ ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. కాగా తమిళ వెర్షన్ ను మీడియా వారికి చూపించారు. తమిళ వెర్షన్ టాక్ చాలా పాజిటివ్ గా ఉండడంతో పాటు తెలుగు వెర్షన్ కూడా డీసెంట్ రిపోర్ట్స్ తో దూసుకెళ్తోంది.
ఒక బలమైన సందేశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో దర్శకుడు వెంకీ అట్లూరి తను చెప్పాలి అనుకున్న విషయాన్ని ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ ల సరైన మేళవింపుతో తెరకెక్కించారని సినిమా చూసిన వారు అంటున్నారు. నిజానికి వెంకీ అట్లూరి ఈ జానర్ ను ట్రై చేయడం ఇదే మొదటిసారి కావడంతో అసలు అలాంటి సబ్జెక్ట్ ను ఆయన తెరకెక్కించగలడా అని అందరూ అనుమంచారు.
అయితే తన శైలికి భిన్నంగా సీరియస్ సినిమాని ఆసక్తికరంగా మలిచినట్లు ప్రీమియర్ షోల నుంచి టాక్ వినిపిస్తుంది. ఇక ధనుష్ తన సినిమాల్లో ఏదో ఒక సందేశాన్ని జోడించి తెరకెక్కించడం మామూలే. అలాగే ఈసారి కూడా ప్రేక్షకులకు ఆయన ఒక మంచి సినిమాని అందించినట్టే కనిపిస్తుంది.
కేవలం నగరాల్లో మాత్రమే ప్రీమియర్స్ ప్రదర్శించినందున క్లాస్ ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. అయితే మాస్ ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఇక వారి టాక్ పైనే బాక్సాఫీస్ వద్ద సినిమా ఎలా ఆడుతుంది అనేది ఆధారపడుతుంది.
ధనుష్ తో పాటు తెలుగులో ఇటీవల బింబిసార, భీమ్లా నాయక్, మలయాళంలో కడువా వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన సంయుక్త మీనన్ కూడా వాతి/సార్ లో నటించారు. సముద్రఖని, తనికెళ్ల భరణి, సాయికుమార్ ఇతర కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాల పై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.