మహేష్ బాబు – త్రివిక్రమ్ ల కాంబినేషన్లో వస్తున్న SSMB28 చిత్రం ఇటీవలే యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణతో ఈ నెల ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్ళింది. కాగా ఈ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరించారు, ఇప్పుడు తదుపరి షెడ్యూల్‌కు తేదీ కూడా ఖరారు చేయబడిందని సమాచారం. ఇక SSMB28 సినిమా టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా తెరకెక్కనుంది.
12 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. తెలుగు సినిమా అభిమానుల హృదయాల్లో ఈ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే సినిమాని ఎక్కడా రాజీ పడకుండా అన్ని అంశాలూ అత్యుత్తమ ప్రమాణాలతో ఉండేలా.. సినిమా కంటెంట్ బాగా వచ్చేలా చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. కాగా ఈ నెల ప్రారంభంలో, ముందుగా చిత్ర బృందం ఒక నెల రోజుల షెడ్యూల్ కోసం ప్లాన్ చేయటం జరిగింది.
అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుకి యాక్షన్ సన్నివేశాలు వచ్చిన తీరు నచ్చకపోవటం వల్ల ఫైట్ మాస్టర్ అన్‌బరీవ్‌ను సినిమా నుంచి పూర్తిగా మార్చాలని నిర్ణయించుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం పై అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు భారీ స్థాయిలో ఉండబోతున్నాయి అని అంటున్నారు. త్రివిక్రమ్ కెరీర్ లోనే ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రంలో ఎక్కువ ఫైట్స్ ఉంటాయని సమాచారం.
ఇక ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్‌ని అక్టోబర్ 10వ తేదీ నుంచి కొనసాగించాలని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నారట. ఈ షెడ్యుల్ లో భాగంగా మహేష్, పూజా హెగ్డే మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ భారీ సినిమాను నిర్మిస్తున్నారు.
కాగా గత సంవత్సరం ఈ సినిమాను ప్రకటించినప్పటి నుండీ మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా కోసం అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.